చిన్నారుల మృతిపై మంత్రి వివరణ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారులు ప్రాణాలుకోల్పోవడానికి ఆక్సిజన్ లేకపోవడం కారణం కాదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో సీరియస్గా దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సున్నితమైనదిగా పరిగణిస్తున్నామని, దాదాపు 3గంటలపాటు సమావేశమై తగిన నిర్ణయాలన్ని తీసుకున్నట్లు తెలిపారు. చాలా అర్ధమంతమైన చర్చలు జరిగాయని, ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతుందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, సున్నితమైనదని చెప్పారు.
ఆస్పత్రిలో ఆక్సిజన్ తక్కువగా ఉందనే విషయం ఎవరూ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ వచ్చినప్పుడు చెప్పలేదని, కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఆస్పత్రితేదనని, ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎందుకు ఆస్పత్రి వర్గాలు బయటకు చెప్పలేదోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించనున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ అందని కారణంగా ఉత్తరప్రదేశ్లోని బీడీఎస్ ఆస్పత్రిలో దాదాపు 60మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన సీఎం యోగి ఎంపీగా బాధ్యతలు వహిస్తున్న గోరఖ్పూర్లోనే చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను ఒక ఊచకోతగా నోబెల్ అవార్డు విజేత కైలాష్ సత్యార్థి అభివర్ణించారు. మరోపక్క, ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ కూడా తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను మోదీ స్వయంగా పరిశీలిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారని వివరించింది.