రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్ల కుంభకోణంపై ఆ శాఖ డీఐజీ వీవీ నాయుడు విచారణకు ఆదేశించారు. నలుగురు అధికారుల్లో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సాయినాథ్, శ్రీధర్‌రాజు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు రవికాంత్, చంద్రశేఖర్‌లను ఇందుకోసం నియమించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, అతని సోదరుడితో కలిసి ఫోర్జరీ, బోగస్ చలాన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడిన విషయం విధితమే. దీనిపై ఈ నెల 13న సాక్షిలో ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం కల్గించింది. మూడు నెలల చలాన్ల పరిశీలనలో రూ.9 లక్షల అక్రమం బయటపడింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందన్న అనుమానాల నేఫథ్యంలో రూ. కోటికి పైగా స్వాహా చేశారని అనుమానిస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నియమాకం నుంచి మొదలుకొని జరిగిన రిజిస్టేషన్ డాక్యూమెంట్లను విచారణ అధికారులు పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా ఎంత ఆదాయం కోల్పోయామో తేటతెల్లం అవుతుందని భావిస్తున్నారు. కాగా నిర్మల్ పోలీసులు ఈ కేసులో విచారణ మొదలుపెట్టారు. నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సంబంధిత డాక్యూమెంట్లు అందజేయలని పోలీసులు అడగడంతో బుధవారం వాటిని అధికారులు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించనున్నారు. తద్వార అసలు సూత్రధారులు ఎవరు అనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి 2008 సంవత్సరం నుంచి జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్నాడు. ఇదివరకు ఆదిలాబాద్, భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేశాడాని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లోనూ పరీశీలన చేయాలనే ఆలోచనలో ఉన్నారు.