నవలా శకం ముగిసినట్టే: యండమూరి
రాజమహేంద్రవరం: ‘నవలలు చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. ఇక నవలా శకం ముగిసినట్టే’నని ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం సంహిత కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ప్రస్తుత సాహిత్యం తీరుతెన్నులపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... కల్చరల్ నా ‘తులసిదళం, కాష్మోరా’, వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల,అనుక్షణికం’, అంతకు ముందు యద్దనపూడి సులోచనారాణి ‘సెక్రటరీ’, ముప్పాళ రంగనాయకమ్మ ‘బలిపీఠం’ మొదలైన నవలలు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నది నిజమే. అయితే ప్రస్తుతం పాఠకులకు కొరత వచ్చింది. చదివే వాళ్ళు తక్కువయిపోతున్నారు. ఇప్పటి వరకూ సుమారు70 రచనలు చేశాను. చేస్తూనే ఉన్నాను.
సామాజిక స్పృహ కాదు.. అలరించే గుణమే ముఖ్యం..
నా నవలల్లో సామాజిక స్పృహ లేదన్న విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదు. చందమామ కథల్లో ఏమంత సామాజిక స్పృహ ఉంది? నవరసాల్లో భయానక రసం ఒకటి. నా రచనలలో ఆ రసం లేకపోలేదు. ప్రాథమికంగా రచనలకు పాఠకులను అలరించే గుణం ఉండాలి. అభిమాన రచయితలు చాలామంది ఉన్నారు. యద్దనపూడి సులోచనారాణి, మల్లాది కృష్ణమూర్తి, కొమ్మూరి వేణుగోపాలరావు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వగైరా..
సినిమాకు వినోదమే ప్రధానం
సినిమాలు కూడా వినోదప్రధానంగా ఉండాలని నేను భావిస్తాను. ఇతర సినిమాలతో పాటు చిరంజీవి నటించిన సినిమాలకు కొన్నింటికి రచనలు చేశాను. రాజకీయాలపై ఆసక్తి లేదు. కాకినాడలో సరస్వతీ విద్యాపీఠం స్ధాపించి,యువతలో మానసిక వికాసానికి కృషి చేస్తున్నాను. మానసిక వికాసంపై పుస్తకాలు రాశాను. విద్యాసంస్థల ఆహ్వానం మేరకు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదించడానికి ప్రసంగాలు చేస్తున్నాను.