వజ్రకరూరు, గార్లదిన్నెలో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో బుధవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వజ్రకరూరు, గార్లదిన్నె మండలాల్లో 50 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శింగనమల , ఉరవకొండ, బెళుగుప్ప, అనంతపురం, పెద్దపప్పూరు మండలాల్లో 30 నుంచి 35 మి.మీ, రాప్తాడు, బుక్కరాయసముద్రం, బత్తలపల్లి, పుట్లూరు మండలాల్లో 20 మి.మీ పైబడి వర్షం కురిసింది. యాడికి, పామిడి, ఆత్మకూరు, కదిరి, కనేకల్లు మండలాల్లో 10 మి.మీ పైచిలుకు నమోదైంది. నార్పల, చెన్నేకొత్తపల్లి, బొమ్మనహాల్, కనగానపల్లి, రామగిరి, పెద్దవడుగూరు, ముదిగుబ్బ, కళ్యాణదుర్గం, పెనుకొండ, ఎన్పీ కుంట, కూడేరు, డి.హిరేహాల్, గుంతకల్లు, గుమ్మగట్ట తదితర మండలాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసింది.
చాలా మండలాల్లో జడివాన పట్టుకోవడంతో రబీ పంటల సాగుకు అనువుగా మారింది. ఇదిలా ఉండగా వారం రోజులుగా ఆకాశం మేఘావతమై తరచు తేలికపాటి జడి రావడంతో తొలగించిన వేరుశనగ పంట, వరిమళ్లు, పూత దశలో ఉన్న కంది, ఆముదం లాంటి పంటలకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ నెల 118.4 మి.మీకుగాను ఇప్పటివరకు 40.7 మి.మీ నమోదైంది.