సీపీఎం నేత మధు మేనల్లుడు దారుణ హత్య
హైదరాబాద్ : సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు మేనల్లుడు హష్మి దారుణహత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ దగ్గర అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా సెల్‌ఫోన్, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మిని స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి హతమార్చినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి గత వారమే టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరాడు.
గచ్చి బౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నివాసం ఉండే వల్లిపల్లి హష్మి 26) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 8.15కి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మంగళవారం ఉదయానికి కూడా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీలో ఆరా తీయగా ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. కాల్ చేస్తే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. హష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో సోదరుడు ఉమామహేశ్వర్రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హష్మి కాల్ డేటా ఆధారంగా నరేష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి విచారిస్తే అసలు విషయం బయటపడింది.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రూమ్ పక్కన ఉండే నరేష్ కుమార్ రెడ్డి రమ్మనడంతో హష్మి వెళ్లాడని, స్నేహితుడే కావడంతో హష్మి అతడి వెంట లింగంపల్లి వరకూ వెళ్లాడని తెలిపారు. తనకు ఓ పదివేలు డబ్బు అవసరమని నరేష్ కుమార్ అడిగాడని, అయితే హష్మి తన దగ్గర లేదని చెప్పడంతో, అతడి దగ్గరున్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడని, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో బండరాయితో కొట్టి చంపినట్లు సీఐ పేర్కొన్నారు.
తర్వాత హష్మి దగ్గరున్న పర్సు, సెల్‌ఫోన్ తీసుకుని నరేంద్ర కుమార్ రెడ్డి వెళ్లిపోయాడని, మర్నాడు ఏమీ తెలియనట్లు హష్మి బైక్ తిరిగి ఇచ్చేయడానికి వచ్చాడని, బైక్ స్నేహితుడికి ఇచ్చాడంటూ కట్టుకథ చెప్పినట్లు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా నిన్న మధ్యాహ్నమే నరేష్ కుమార్ రెడ్డిన అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్లు సీఐ వెల్లడించారు. మరోవైపు సీపీఎం కార్యదర్శి మధుతో పాటు కుటుంబసభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హష్మి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.