Vandalur zoo
-
షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి
చెన్నై: కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను సైతం వీడటం లేదు. కోవిడ్‌తో ఇటీవల(జూన్3) తమిళనాడులోని అరిగ్నర్ అన్నా జూపార్క్‌లో ఓ మగ సింహం(నీలా) చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని అదే జూలో బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో మరో సింహం మరణించిందని జూ అధికారులు తెలిపారు. పద్మనాథన్ అని పిలవబడే ఈ సింహం వయస్సు 12 ఏళ్లు. జూన్ 3న ఈ సింహం శాంపిల్స్‌ను భోపాల్‌లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని చెప్పారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో సింహానికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందించామని జూ అధికారులు పేర్కొన్నారు. దీనిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. కాగా ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు. చదవండి: అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి కరోనా వైరస్‌తో సివంగి మృతి -
తెల్ల పులులను దత్తత తీసుకున్న హీరో
ఈ తరం హీరోలు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా చెన్నై సమీపంలోని వాండలూర్ జూలోని రెండు తెల్ల పులులను దత్తత తీసుకున్నారు. ఆరు నెలల పాటు ఈ పులుల పోషణకు కావాల్సిన పూర్తి ఖర్చును విజయ్ సేతుపతి భరించనున్నాడు. ఈ మేరకు 5 లక్షల రూపాయల చెక్కును జూ నిర్వహకులకు అందజేశాడు విజయ్ సేతుపతి. గతంలో హీరోలు శివకార్తీకేయన్, కార్తీలు కూడా అదే జూలోని వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సూపర్ డీలక్స్ త్వరలో రిలీజ్ అవుతుండగా తమిళ్లో మా మనితన్ తెలుగులో సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటిస్తున్నారు. -
'పులిపిల్లలకు అమ్మ పేరు పెట్టింది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగు పులిపిల్లలకు నామకరణం చేశారు. ఆదివారం ఆమె చెన్నైలోని వండలూర్ లోని అరిగ్నార్ అన్నా జూపార్క్‌ను సందర్శించిన సందర్భంగా నమృత అనే తెల్ల పులికి కొత్తగా జన్మించిన నాలుగు తెల్ల పులిపిల్లలకు పేర్లు పెట్టారు. నాలు పిల్లల్లో రెండు మగ పులిపిల్లలు కాగా, రెండు ఆడ పులిపిల్లలు. రెండు మగ పులిపిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టిన జయ ఆడపులిపిల్లలకు కాలా, మాలా అని పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ ఏడాది జూన్ నెలలో నాలుగు తెల్ల పులిపిల్లలకు జయ పేరుపెట్టిన విషయం తెలిసిందే. -
జూ నుంచి జారుకున్న పులులు!
చెన్నై : ఏళ్ల తరబడి జూ లోపలే కాలం గడపడం ఆ పులులకు బోరు కొట్టినట్లుంది. చెన్నై వండలూరులోని జూ (అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్) నుంచి శనివారం రెండు పులులు చల్లగా జారుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన వండలూరు జూలో అనేక జంతువులతోపాటు 16 పులులు, 5 తెల్ల పులులు ఉన్నాయి. నగరంలో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురవడంతో జూలో పులులు సంచరించే ప్రాంతంలోని ప్రహరీగోడ ఈ ఉదయం 30 అడుగుల మేర కూలిపోయింది. ప్రహరీ కూలిన ప్రాంతంలో ఇనుపవైర్లతో కంచె నిర్మించారు. గోడ కూలగానే రెండు పులులు అక్కడి నుంచి వెలుపలకు వెళ్లిపోయినట్లు అక్కడి కాలిగుర్తులను బట్టి అనుమానిస్తున్నారు. గోడ కూలినట్లు సమాచారం అందుకున్న అధికారులు హడావుడిగా ప్రహరీ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న నాలుగు పులులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరో ప్రాంతానికి తరలించారు. వండలూరు జూ నుంచి రెండు పులులు పారిపోయాయనే ప్రచారంతో ఆయా పరిసరాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే అధికారులు మాత్రం పులులు వెలుపలకు వెళ్లినట్లు ధృవీకరించడం లేదు. జూలో ఉన్న పులులను లెక్కిస్తున్నామని, గోడకూలినా పులులు పారిపోయే అవకాశం లేదని వారు అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. **