కూలిపోయిన జూ ప్రహరీగోడ
చెన్నై : ఏళ్ల తరబడి జూ లోపలే కాలం గడపడం ఆ పులులకు బోరు కొట్టినట్లుంది. చెన్నై వండలూరులోని జూ (అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్) నుంచి శనివారం రెండు పులులు చల్లగా జారుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన వండలూరు జూలో అనేక జంతువులతోపాటు 16 పులులు, 5 తెల్ల పులులు ఉన్నాయి. నగరంలో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురవడంతో జూలో పులులు సంచరించే ప్రాంతంలోని ప్రహరీగోడ ఈ ఉదయం 30 అడుగుల మేర కూలిపోయింది. ప్రహరీ కూలిన ప్రాంతంలో ఇనుపవైర్లతో కంచె నిర్మించారు. గోడ కూలగానే రెండు పులులు అక్కడి నుంచి వెలుపలకు వెళ్లిపోయినట్లు అక్కడి కాలిగుర్తులను బట్టి అనుమానిస్తున్నారు. గోడ కూలినట్లు సమాచారం అందుకున్న అధికారులు హడావుడిగా ప్రహరీ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న నాలుగు పులులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరో ప్రాంతానికి తరలించారు.
వండలూరు జూ నుంచి రెండు పులులు పారిపోయాయనే ప్రచారంతో ఆయా పరిసరాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే అధికారులు మాత్రం పులులు వెలుపలకు వెళ్లినట్లు ధృవీకరించడం లేదు. జూలో ఉన్న పులులను లెక్కిస్తున్నామని, గోడకూలినా పులులు పారిపోయే అవకాశం లేదని వారు అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు.
**