ఎమ్మార్పీఎస్ నేతపై హత్యాయత్నం
* జడ్చర్ల సమీపంలో వంగపల్లి వాహనం అడ్డగింత
* కర్రలు, రాళ్లతో దాడి, పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం
* డ్రైవర్‌కు గాయాలు, తృటిలో తప్పించుకున్న వంగపల్లి
* ఇది మందకృష్ణ పనే అని ఆరోపణ
జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన వాహనాన్ని అడ్డగించిన కొందరు దుండగులు.. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేసి వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నిం చగా.. తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన లో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన ఎంఎస్ఎఫ్ జిల్లా సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్‌తో సహా రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల హాజరయ్యారు.
సాయంత్రం ఏడు గంటలకు తమ వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని జడ్చర్ల హౌసింగ్‌బోర్డు సమీపంలోకి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో డ్రైవర్ జైపాల్‌రెడ్డికి గాయాలయ్యాయి. ముందు సీటులో వున్న రాజుపై పెట్రోలు పోశారు. ప్ర మాదాన్ని పసిగట్టి వారంతా తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ జంగయ్యకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగేనని వంగపల్లి శ్రీని వాస్ ఆరోపించారు. జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జంగయ్య, కోళ్ల వెంకటేశ్ తదితరులపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.