varity food
-
ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్?
ప్రపంచంలో అణువణువునా ఆహార ప్రియులు కనిపిస్తారు. ఈ ఫుడ్ లవర్స్ కారణంగానే కొత్త ప్రయోగాలతో వినూత్న ఆహారాలు పుట్టుకొస్తుంటాయి సోషల్ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. తాజాగా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆమె ఈ బిస్కెట్ పకోడీలను వేయించడానికి ముందు.. మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చూడండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP — 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023 -
రుచులూరే.. షాహీ తుకడా, ఖీమా పన్నీర్ వండేద్దాం ఇలా..
ఈ కొత్త రుచులను ట్రై చేయండి. ఘుమ ఘుమలాడే వంటకాలతో మీ ఇంటిల్లిపాదిని ఆనందపరచండి. షాహీ తుకడా కావల్సినవి పధార్థాలు మిల్క్ బ్రెడ్ స్లైసులు – ఆరు పాలు – లీటరు పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు యాలకులపొడి – అర టేబుల్ స్పూను కుంకుమ పువ్వు – అరటీస్పూను పిస్తా పలుకులు – ఐదు టీస్పూన్లు బాదం పలుకులు – ఐదు టీస్పూన్లు సుగర్ సిరప్ నీళ్లు – అరకప్పు పంచదార – అరకప్పు యాలకులు – రెండు రోజ్ వాటర్ – అరటీస్పూను గార్నిష్ బ్రెడ్‌స్లైసులు – మూడు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా టేబుల్‌స్పూను పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టు కోవాలి. ►మందపాటి గిన్నెలో పాలు పోసి వేడిచేయాలి. ►పాలు మీగడ కట్టి, సగమయ్యాక, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి, 5 నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తరువాత దించి పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు అరకప్పు పంచదార, నీళ్లు వేసి తీగపాకం వచ్చిన తరువాత రోజ్ వాటర్, యాలకులపొడి వేసి కలపాలి. ►ఈ పాకంలో బ్రెడ్ స్లైసులను వేసి నానబెట్టుకోవాలి. ►గార్నిష్ కోసం తీసుకున్న బ్రెడ్‌ను త్రికోణాకృతి ఆకృతిలో కట్ చేసి నెయ్యిలో బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►వీటిని కూడా పాకంలో 15 సెకన్ల పాటు ఉంచాలి. ►ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో బ్రెడ్‌ముక్కలు వరుసగా పేర్చి, కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వాటిమీద పోసి, గార్నిష్ కోసం తీసుకున్న పదార్థాలను వేసి సర్వ్చేస్తే ఎంతో రుచికరమైన షాహీ తుకడ రెడీ. ఖీమా పన్నీర్ కావల్సినవి పధార్థాలు పన్నీర్ తురుము – కప్పు బటర్ – మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను లవంగాలు – రెండు దాల్చిన చెక్క – చిన్న ముక్క యాలకులు – రెండు బిర్యానీ ఆకు – ఒకటి మిరియాలు – మూడు ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) టొమోటో – రెండు (సన్నగా తరుక్కోవాలి) అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి) కారం – రెండు టీస్పూన్లు పసుపు – పావు టీస్పూను ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – అరటీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – అరటీస్పూను నిమ్మరసం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద బాండీ వేడెక్కిన తరువాత బటర్, నూనె వేయాలి. రెండూ వేడయ్యాకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి నిమిషం వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమోటో, కొత్తిమీర తరుగు వేసి కలిపి మగ్గనివ్వాలి. ►టొమోటో మగ్గాకా.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి సన్నని మంటమీద తిప్పుతూ ఉండాలి. ►ఆయిల్ పైకి తేలిన తరువాత పన్నీర్ తురుము, గరం మసాలా, పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . ►ఇప్పుడు మూతపెట్టి మూడు నిమిషాల ఉడికించి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే ఖీమా పన్నీర్ రెడీ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
టేస్టీ టొమేటి
టొమాటో కొనకుండా కూరగాయలు కొనటం పూర్తి కాదు. ఏ వంటలోనైనా పడక తప్పని కాయగూర టొమాటో. కాని టొమాటోకే ఒక అస్థిత్వం ఉంది. దానికంటూ కొన్ని రెసిపీలున్నాయి. అది చేసే కొన్ని మేళ్లు ఉన్నాయి. అది చూపే కొన్ని రుచులు ఉన్నాయి. పిజ్జా సాస్, టొమాటో సాస్, టొమాటో షోర్బా, టొమాటో ఖజూర్ చట్నీ, టొమాటో చోకా... వీటిని ప్రయత్నించండి, టొమాటోనే మేటి అనండి. టొమాటో చోకా కావలసినవి: టొమాటోలు – 200 గ్రా; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; ఆవ నూనె – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడిగా ఉన్న గ్రిల్ మీద ఉంచి కాల్చాలి (పెనం మీద కూడా వేడి చేసుకోవచ్చు) ∙బాగా కాలే వరకు ముందుకి, వెనక్కు తిప్పుతూ కాల్చి తీసేసి, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక తొక్కలు తీసేసి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఆవ నూనె, నిమ్మ రసం జత చేయాలి ∙ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ∙పరాఠా, చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. పిజ్జా సాస్ కావలసినవి: టొమాటో ముక్కలు – 3 కప్పులు; వెల్లుల్లి తరుగు – టీ స్పూను; పుదీనా – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – తగినంత. తయారీ ►టొమాటోలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి గుజ్జు చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి నాలుగైదు నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి ►గుజ్జు బాగా ఉడికిన తరవాత, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి జత చేసి, దింపేయాలి ►పిజ్జా మీద సాస్ వేసి సర్వ్ చేయాలి. టొమాటో సాస్ కావలసినవి: టొమాటోలు – రెండున్నర కిలోలు; వెల్లుల్లిరెబ్బలు – 15; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; కిస్మిస్ – అర కప్పు; వైట్ వెనిగర్ – అర కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక కప్పు; సోడియం బెంజోట్ – పావు టీ స్పూను. తయారీ: ∙టొమాటోలను నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ∙స్టౌమీద పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి, ఎండు మిర్చి, కిస్మిస్, వైట్ వెనిగర్, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలియబెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) టొమాటో గుజ్జు బాగా ఉడికి చిక్కబడ్డాక దింపి (సుమారు అరగంట సమయం పడుతుంది) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి, జల్లెడ పట్టాలి ∙ఈ గుజ్జును ఒక పెద్ద పాత్రలో వేసి మరోమారు స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూను నీళ్లు, పావు టీ స్పూను సోడియం బెంజోట్ వేసి కరిగేవరకు కలిపి, తయారైన కెచప్‌లో వేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక జాడీలోకి తీసుకుని భద్రపరచుకోవాలి ∙ఫ్రిజ్‌లో ఉంచి, రెండు రోజుల తరవాత వాడుకోవాలి. టొమాటో ఖజూర్ చట్నీ కావలసినవి: ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; పాంచ్ పోరన్ (మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, సోంపు) – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; అల్లం తురుము – అర టీ స్పూను; టొమాటోలు – పావు కేజీ; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేడి చేశాక, పాంచ్ పోరన్ జత చేసి వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙అల్లం తురుము జత చేసి, కొద్దిసేపు వేయించాలి ∙టొమాటో తరుగు జత చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి, మూత ఉంచి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి ∙మెత్తగా ఉడికిన తరవాత కిస్మిస్, ఖర్జూరాల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార, ఆమ్చూర్ పొడి జత చేసి మరోమారు కలిపి, మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపి, చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి (ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది). టొమాటో షోర్బా కావలసినవి: టొమాటో తరుగు – 2 కప్పులు; నూనె – అర టేబుల్ స్పూను; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙టొమాటో గుజ్జు, బిర్యానీ ఆకు జత చేసి బాగా కలపాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ∙రెండు కప్పుల నీళ్లు జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఉప్పు జత చేయాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి దింపేయాలి ∙ఇది వెజ్ పులావు, కాజూ రైస్, జీరా రైస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. -
రాచాయపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్‌ఫెస్టివల్
గోపవరం : మండలంలోని రాచాయపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌ఫెస్టివల్ కార్యక్రమాన్ని శుక్రవారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించిన ఫుడ్‌ఫెస్టివల్‌కు పాఠశాలలోని 200 మంది విద్యార్థులు వివిధ రకాల వంటలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వంటకాల ప్రదర్శనలో విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసేందుకు గోపవరం, బ్రాహ్మణపల్లె ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, సత్యనారాయణశర్మలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విజేతలుగా ఎంపికైన విద్యార్థులను 14వ తేదీ బాలల దినోత్సవం రోజున బహుమతులను అందచేయనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జిలానిబాష, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.