టేస్టీ టొమేటి | Varieties Of Tomato Recipes | Sakshi
Sakshi News home page

టేస్టీ టొమేటి

Published Sat, Feb 22 2020 3:54 AM | Last Updated on Sat, Feb 22 2020 3:54 AM

Varieties Of Tomato Recipes - Sakshi

టొమాటో కొనకుండా కూరగాయలు కొనటం పూర్తి కాదు. ఏ వంటలోనైనా పడక తప్పని కాయగూర టొమాటో. కాని టొమాటోకే ఒక అస్థిత్వం ఉంది. దానికంటూ కొన్ని రెసిపీలున్నాయి. అది చేసే కొన్ని మేళ్లు ఉన్నాయి. అది చూపే కొన్ని రుచులు ఉన్నాయి. పిజ్జా సాస్, టొమాటో సాస్, టొమాటో షోర్బా, టొమాటో ఖజూర్‌ చట్నీ, టొమాటో చోకా... వీటిని ప్రయత్నించండి, టొమాటోనే మేటి అనండి.

టొమాటో చోకా

కావలసినవి: టొమాటోలు – 200 గ్రా; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; ఆవ నూనె – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను.
తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడిగా ఉన్న గ్రిల్‌ మీద ఉంచి కాల్చాలి (పెనం మీద కూడా వేడి చేసుకోవచ్చు) ∙బాగా కాలే వరకు ముందుకి, వెనక్కు తిప్పుతూ కాల్చి తీసేసి, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక తొక్కలు తీసేసి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఆవ నూనె, నిమ్మ రసం జత చేయాలి ∙ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ∙పరాఠా, చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది.

పిజ్జా సాస్‌

కావలసినవి: టొమాటో ముక్కలు – 3 కప్పులు; వెల్లుల్లి తరుగు – టీ స్పూను; పుదీనా – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఆలివ్‌ ఆయిల్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – తగినంత.
తయారీ 
►టొమాటోలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్‌ చేసి, మిక్సీలో వేసి గుజ్జు చేసి, పక్కన ఉంచాలి 
►స్టౌ మీద బాణలిలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాగాక, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి 
►టొమాటో గుజ్జు జత చేసి నాలుగైదు నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి 
►గుజ్జు బాగా ఉడికిన తరవాత, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి జత చేసి, దింపేయాలి 
►పిజ్జా మీద సాస్‌ వేసి సర్వ్‌ చేయాలి.

టొమాటో సాస్‌

కావలసినవి: టొమాటోలు – రెండున్నర కిలోలు; వెల్లుల్లిరెబ్బలు – 15; అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 10; కిస్‌మిస్‌ – అర కప్పు; వైట్‌ వెనిగర్‌ – అర కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక కప్పు; సోడియం బెంజోట్‌ – పావు టీ స్పూను.
తయారీ: ∙టొమాటోలను నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ∙స్టౌమీద పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి, ఎండు మిర్చి, కిస్‌మిస్, వైట్‌ వెనిగర్, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలియబెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) టొమాటో గుజ్జు బాగా ఉడికి చిక్కబడ్డాక దింపి (సుమారు అరగంట సమయం పడుతుంది) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి, జల్లెడ పట్టాలి ∙ఈ గుజ్జును ఒక పెద్ద పాత్రలో వేసి మరోమారు స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూను నీళ్లు, పావు టీ స్పూను సోడియం బెంజోట్‌ వేసి కరిగేవరకు కలిపి, తయారైన కెచప్‌లో వేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక జాడీలోకి తీసుకుని భద్రపరచుకోవాలి ∙ఫ్రిజ్‌లో ఉంచి, రెండు రోజుల తరవాత వాడుకోవాలి.

టొమాటో ఖజూర్‌ చట్నీ

కావలసినవి: ఆవ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పాంచ్‌ పోరన్‌ (మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, సోంపు) – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; అల్లం తురుము – అర టీ స్పూను; టొమాటోలు – పావు కేజీ; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఖర్జూరాల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; 
ఆమ్‌చూర్‌ పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేడి చేశాక, పాంచ్‌ పోరన్‌ జత చేసి వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙అల్లం తురుము జత చేసి, కొద్దిసేపు వేయించాలి ∙టొమాటో తరుగు జత చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి, మూత ఉంచి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి ∙మెత్తగా ఉడికిన తరవాత కిస్‌మిస్, ఖర్జూరాల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార, ఆమ్‌చూర్‌ పొడి జత చేసి మరోమారు కలిపి, మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపి, చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి (ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది).

టొమాటో షోర్బా

కావలసినవి: టొమాటో తరుగు – 2 కప్పులు; నూనె – అర టేబుల్‌ స్పూను; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత.
తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో అర టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙టొమాటో గుజ్జు, బిర్యానీ ఆకు జత చేసి బాగా కలపాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ∙రెండు కప్పుల నీళ్లు జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఉప్పు జత చేయాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి దింపేయాలి ∙ఇది వెజ్‌ పులావు, కాజూ రైస్, జీరా రైస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement