varnam
-
వర్ణం: అశ్వసామర్థ్యం
మనిషికి కావాల్సిన ముఖ్యమైన మూడు... కూడు, గూడు, గుడ్డ అయితే, మరి నాలుగోది? వినోదం! ఎన్నో రూపాల్లో వినోదం పొందుతాడు మనిషి. ఈ గుర్రాల పోట్లాట కూడా అట్లాంటిదే! ఫిలిప్పీన్స్లోని మగైండనావో ప్రాంతంలోనిదీ దృశ్యం. పది లక్షలకు మించని జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో టీవీ, సినిమాలు, ఇంటర్నెట్ ఏమీలేవు. శతాబ్దాలుగా ఈ వినోదక్రీడ సాగుతోంది. అక్కడ మహిళలు, పిల్లలు కూడా గుర్రం వేసుకుని వెళ్లిపోగలరు. -
వర్ణం: ఉత్సవంలో పోరాటం!
గతం వర్తమానంతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది. భూతకాలంలోని మంచీ, చెడూ ఏదైనాకూడా వర్తమానంలో ఉత్సవంగా రూపాంతరం చెందుతుంది. ఇటలీలో జరుపుకొనే ఈ ‘బ్యాటిల్ ఆఫ్ ది ఆరెంజెస్’ కూడా అలాంటిదే! రాక్షసపాలకులైన మధ్య యుగాల ప్రభువులను తరిమికొట్టడాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో వేలాది మంది పాల్గొంటారు. తొమ్మిది జట్లుగా విడిపోయి నారింజ పళ్లను ఒకరి మీదికి ఒకరు కాస్త గట్టిగానే విసురుకుంటూ తమ ప్రాచీనులతో కలిసి పోరాడిన అనుభూతి చెందుతారు. అధ్యక్షులవారి సప్లయర్ ఇతడు ఆంథోనీ తెషెరా. చేతిలోవి బ్యాగెట్లు. పిండి, ఈస్టు, ఉప్పు, నీళ్లతో చేసే ఫ్రెంచు రొట్టెలివి. 26 అంగుళాల పొడవుంటాయి. వీటిని చేయడంలో తెషెరా ప్రవీణుడు. అందువల్లే ‘బెస్ట్ బ్యాగెట్ ఆఫ్ పారిస్’ బహుమానం గెలుచుకున్నాడు. దీనివల్ల ఆయనకు ఏమొస్తుందంటారా? ఫ్రాన్సు అధ్యక్షుడి నివాస భవనమైన ‘ఎలిసీ ప్యాలెస్’కు అధికారికంగా బ్యాగెట్లను సప్లై చేసే కాంట్రాక్టు దక్కుతుంది. కుక్కెనక కుక్కగట్టి... ఇది అలస్కాలో ఆదరణ ఉన్న మంచు పరుగుపందెం. ‘ఇడిటారోడ్ ట్రయల్ స్లెడ్ డాగ్ రేస్’గా పిలిచే ఈ పోటీలో... గడ్డకట్టే చలిలో 1570 కిలోమీటర్ల దూరాన్ని 26 చెక్పాయింట్స్ దగ్గర క్యాంపులు వేసుకుంటూ మషర్స్ వెళ్తారు. ఈ స్లెడ్ బండిని కట్టడంలో ఒక పద్ధతి ఉంటుంది. అన్నింటికీ ముందుండేది లీడ్ డాగ్. ఒక్కోసారి రెంటినీ కట్టొచ్చు. ఇవి మషర్ ఆజ్ఞలను పాటిస్తూ బృందానికి నాయక స్థానంలో ఉంటాయి. వాటి తర్వాతి జత స్వింగ్ డాగ్స్. వీటికి మలుపుల్లో స్లెడ్ను లాగే నైపుణ్యం ఉంటుంది. తర్వాత వరుసగా ఉండే మూడు జతలు టీమ్ డాగ్స్. ఇవి బాగా పరుగెత్తగలుగుతాయి. బండికి తక్షణం ముందుండే జత వీల్ డాగ్స్. ఇవి బండిని బలంగా లాగుతాయి. ఈసారి విజేత డల్లాస్ సీవీ(అమెరికా) నిర్దేశిత దూరాన్ని 8 రోజుల 13 గంటల్లో పూర్తిచేశాడు. ముప్పై లక్షల రూపాయల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. అదనంగా ట్రక్కు! డబ్బుల్ని వేసుకెళ్లడానికని ఊహిస్తున్నారా! -
వర్ణం: కనువిందైన దృశ్యం!
గౌహతి నగర శివారులో... సిమోలు పుష్పాలపై పక్షి వాలుతున్నప్పుడు తీసిన అద్భుత చిత్రమిది. ఈ పక్షి పేరు రుఫౌస్ ట్రీపై. ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని డెండ్రోసిటా వాగబండా అని పిలుస్తారు. చైనా మన్మథుడు ! ఇది... చైనా పురాణాల్లో ప్రేమకు, పెళ్లికి దేవుడు అయిన ‘ది మ్యాచ్ మేకర్’ విగ్రహం. ఈ దేవుడికి మరో పేరు ‘ది ఓల్డ్ మ్యాన్ అండర్ ది మూన్’. తైపే నగరంలోని జియా హై సిటీ టెంపుల్లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా వీటిని అమ్మారు. ఈ దేవుడిని ఆరాధిస్తే త్వరగా ప్రేమలో పడతారట! 52 దేశాలు, 2500 జంటలు! సామూహిక వివాహాలు కొత్తేం కాదు కానీ... అంతర్జాతీయ సామూహిక వివాహాలు మాత్రం అన్ని చోట్లా జరగవు. దక్షిణ కొరియా, గెపియాంగ్లోని యునిఫికేషన్ చర్చిలో ఓ అద్భుతం ఒకటి జరిగింది.. 52 దేశాలకు చెందిన 2500 జంటలు ఒకే ముహూర్తంలో ఇక్కడ మనువాడాయి. ఇన్ని దేశాలకు చెందిన వ్యక్తులతో జరిగిన సామూహిక వివాహాల్లో ఇది రెండోదట!