వాసవీ కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్ : వనస్థలిపురంలోని వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్వాకంపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. అలాగే విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి అవకాశం కల్పిస్తామని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
ఎంసెట్‌కు కూడా విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను, ప్రభుత్వాన్ని మోసం చేసిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. పిల్లలను కాలేజీల్లో చేర్పించే ముందు కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? కాలేజీ ట్రాక్ రికార్డు మంచిదా? కాదా? చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కడియం సూచించారు.
‘ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, ఉమెన్ వ్యాల్యూస్ అనే పరీక్షలకు సదరు కళాశాల విద్యార్థులు హాజరు కాలేదు, దీనికి 20 శాతం మార్కులుంటాయి. ప్రాక్టికల్స్ కూడా చేయలేదు. ఈ రెండు చేయలేదని వెంటనే స్పందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యార్థులకుంది. వీటిని తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకునేవాళ్లం’ అని ఆయన అన్నారు. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పులకు విద్యార్థులు నష్టపోకూడదని, విద్యా సంవత్సరం వృథా కావద్దనే ఉద్దేశ్యంతో వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ అవకాశం, ఎంసెట్ రాసే వెసులుబాటు కల్పేంచేందుకు చర్యలు తీసుకుంటామని కడియం అభయమిచ్చారు.
కళాశాలపై క్రిమినల్ చర్యలు....
విద్యార్థులు, బోర్డును మోసగించిన నగరంలోని వనస్థలిపురంలో గల శ్రీవాసవి కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. కాలేజీ యాజమాన్యం నిర్వాకంతో 300 మందికిపైగా విద్యార్థులు నేడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు దూరమయ్యారు. నిన్నటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్న హాల్‌టికెట్లు ఇవ్వలేమని ఇటు కాలేజీ యాజమాన్యం, అటు ఇంటర్ బోర్డు చేతులెత్తేసింది. విద్యార్థుల ఆందోళనపై ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పందించారు.
శ్రీవాసవి కళశాల యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించలేదన్నారు. కళాశాల విద్యార్థులను, బోర్డును మోసగించిందన్నారు. కాగా ఇవాళ జరిగే పరీక్షకు హాల్‌టికెట్లు ఇవ్వకపోయిన తర్వాత జరగబోయే పరీక్షలకైనా హాల్‌టికెట్లు అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఉదయం కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ పిల్లల భవిష్యత్ దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.