విద్యార్థుల పరీక్ష ఫీజులను యాజమాన్యం చెల్లించకపోవడంతో నష్టపోయిన వనస్థలిపురంలోని శ్రీ వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల పరీక్ష ఫీజులను యాజమాన్యం చెల్లించకపోవడంతో నష్టపోయిన వనస్థలిపురంలోని శ్రీ వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టామని, వారంతా ఆ కాలేజీలో ఫీజులు చెల్లించి, హాల్‌టికెట్లు పొందాలని పేర్కొంది.
త్వరలోనే ఇంటర్మీడియెట్ ఫలితాలను విడుదల చేస్తామని, అదే రోజున పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ప్రకటిస్తామని వివరించింది. అలాగే వాసవి కాలేజీ విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యేందుకు జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలి ఒప్పుకున్నాయని పేర్కొంది. ఆయా విద్యార్థుల ప్రథమ సంవత్సర హాల్‌టికెట్ నంబరుతో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది