Vasudev
-
జైహింద్ స్పెషల్: ఫడ్కే.. ఇప్పుడు నీకేం కావాలి? నీతో యుద్ధం..
స్వాతంత్య్ర సముపార్జనకు విప్లవమార్గమే శరణ్యమని నమ్మి అనేక మంది భరతమాత బిడ్డలు బలిదానం చేశారు. ఇలాంటి విప్లవ వీరులకు ఆద్యుడు వాసుదేవ బలవంత్ ఫడ్కే! స్థానిక ఆదివాసీలతో కలిసి గెరిల్లా పోరుతో వలస పాలకులకు ఫడ్కే ముచ్చెమటలు పట్టించాడు. తొలిసారి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన ఈ మరాఠా వీరుడిని ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ రెబెలియన్’గా చరిత్రకారులు భావిస్తారు. చదవండి: బ్రేకింగ్ న్యూస్..డయ్యర్‌కు బులెట్ దిగింది! గ్రామం మధ్యలో శపథం మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో వాసుదేవ్ బల్వంత్‌రావ్ ఫడ్కే 1845 నవంబర్ 4న వాసుదేవ్ జన్మించారు. స్వస్థలం మహారాష్ట్రలోని షిర్దాన్ గ్రామం. వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో వ్యవసాయ కుటుంబాలన్నీ దుర్బర దారిద్య్రం అనుభవించేవి. బాల్యంలో కుటుంబ బాధలు అర్ధం కాని వయసులో ఫడ్కే కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు మధ్యలో వదిలివేశారు. 16 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి జరిగింది. కొంతకాలం రైల్వే సర్వీసులో పని చేసి అనంతరం స్వీయ పదవీ విరమణ చేసారు. తరువాత పుణే నగరం చేరుకుని మిలటరీ అక్కౌంట్స్ డిపార్టుమెంటులో గుమస్తాగా 15 సంవత్సరాల పాటు పని చేశారు. గణేష్ జోషి, రనడే ఏకనాథ వంటి ఉద్యమకారుల పరిచయంతో ఫడ్కే ‘పుణె నేటివ్’ అన్న సంస్థను స్థాపించారు. ఆ సమయంలోనే తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం తెలుసుకొని స్వగ్రామం చేరుకున్నారు. అయితే బ్రిటిషర్ల ప్రోద్బలంతో గ్రామస్తులు ఫడ్కే రాకముందే ఆయన తల్లి దహనసంస్కారాలు పూర్తి చేశారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఫడ్కే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానని గ్రామం మధ్యలో శపధం చేశారు. రామోషీ పోరాటం 1876 –77లో మహారాష్ట్రలో అత్యంత భయంకరమైన కరువు తాండవించింది. వేలమంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణించారు. అయితే బ్రిటిష్ దొరలు ఈ మరణాలను పట్టించుకోకపోగా, పండిన కాస్త పంటనూ బలవంతంగా తీసుకునేవాళ్లు. దీంతో పలు రైతు కుటుంబాలు నిరాధారాలయ్యాయి. అనేకమంది దారిద్ర బాధతో మగ్గిపోయారు. ఇవన్నీ చూస్తూన్న ఫడ్కే తీవ్రంగా బాధపడ్డారు. స్వరాజ్య సాధనే పరిస్థితులు మెరుగు పరుచుకుందుకు మార్గమని భావించారు. ఇందుకోసం స్థానిక కోలీలు, భీల్‌లు, ధంగారులు తెగల వారిని కూడగట్టుకొని ఒక తిరుగుబాటు సేనను తయారుచేసి దానికి ‘రామోషి‘ (ఒక ఆదివాసీ తెగ) అని పేరు పెట్టారు. ఈ సేనతో బ్రిటిష్ పరిపాలన అంతం చేయడానికి సాయుధ పోరాటాన్ని సాగించారు. బ్రిటిష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించడం పాలకులను కలవరపెట్టింది. వలస పాలకుల వల ఫడ్కే ఉద్యమ ప్రభావంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఫడ్కేను చంపిన లేక బంధించిన వారికి రూ. 5వేల బహుమతి ఇస్తామని బొంబాయి ప్రభుత్వ గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ ప్రకటించారు. దీనికి జవాబుగా బొంబాయి గవర్నర్ సర్ టెంపుల్ తలనే తనకు తెచ్చిన వారికి పదివేల బహుమతి ఇస్తానని ఫడ్కే ప్రకటన చేయడం ఆయన నిర్భీతిత్వాన్ని చాటుతుంది. రామోషీ దాడులు అధికం కావడంతో ఫడ్కేను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. మరోవైపు బ్రిటిషర్లకు సహకారం అందిస్తున్న నిజాం ప్రభుత్వం కూడా ఫడ్కేను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్ నిజాం పోలీసు కమిషనర్ అబ్దుల్ హక్ విరామం లేకుండా ఆయన అచూకీ కోసం వెతికారు. ఈ సమయంలో ఫడ్కే నిజాం రాజ్యానికి చేరుకున్నాడు. వీరుడి మాటలు ఒక రోజు మొత్తం పరిగెడుతూనే ఉండడం వల్ల చాలా అలసిపోయి ఉన్న ఫడ్కేకు జ్వరం రావడంతో విశ్రాంతి కోసం హైదరాబాదులోని కలాడిగిన తాలూకాలోని ఒక పల్లెటూరికి చేరి దేవి మందిరంలో పడుకున్నారు. జ్వరంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆయనను కనిపెట్టి స్థానిక మహిళలు కొందరు ధనం కోసం ఆశపడి సైనికులకు చెప్పారు. ఈ సమాచరంతో బ్రిటిష్ ఆర్మీ మేజర్ డేనియల్ అక్కడికి చేరుకున్నాడు. తన బలగాలను అక్కడ మోహరించి, ఫడ్కే గుండెలపై తంతూ, మెడ మీద కాలు పెట్టి.. ‘ఫడ్కే, ఇప్పుడు నీకు ఏం కావాలి అని అడిగాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ‘నీతో యుద్ధం చేద్దామనుకుంటున్నాను’ అని వీరుడిలాగా ఫడ్కే సమాధానమిచ్చారు. కానీ అందుకు జడిసిన డేనియల్.. ఫడ్కేను బంధించి పుణె తీసుకువెళ్లాడు. అనంతరం ఆయన్న యెమెన్‌లోని ఏడిన్ కారాగారానికి తరలించారు. 1883 ఫిబ్రవరి 13 న ఫడ్కే అక్కడ నుంచి తప్పించుకున్నా, వెంటనే తిరిగి పట్టుబడ్డారు. రెండోదఫా కారాగారవాసంలో ఫడ్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కారణంగా ఫిబ్రవరి 17న 1883 న ఫడ్కే 37 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ‘ఈ దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే. వారంతా ఆకలి, దారిద్య్రంతో అలమటిస్తూంటే, ఏమీ పట్టనట్టుగా జీవించడమనే ఊహే నేను భరించలేను. నా ప్రజలకు స్వతంత్రం ఇవ్వడం కోసం, అవసరం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అని ఫడ్కే తన డైరీలో రాసుకున్న మాటలు ఆయన అకుంఠిత దేశభక్తిని చాటుతున్నాయి. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
నా పేరు రామ సీత వాసుదేవ్
చాలా మంది తాము నటించిన పాత్రల పేర్లతో పాప్యులర్ అవుతారు. అయితే నేను నటించిన సూపర్ హిట్ సీరియల్ రామ సీతలో పాత్ర పేరూ నా పేరే కావడంతో స్వంత పేరుతోనే నేను పాపులర్ అయ్యా అంటున్నారు చిన్నితెర నటుడు వాసుదేవ్. పుష్కర కాలం నుంచీ చిన్నితెరపై నటుడిగా వెలుగొందుతున్న వాసుదేవ్ పంచుకున్న కబుర్లు ఇవి... నేను పుట్టింది మెదక్ జిల్లాలోని కొరివి పల్లి అయితే పెరిగిందంతా హైదరాబాద్ అల్వాల్‌లోనే. నాన్నది వ్యవసాయం. అన్నయ్య శ్రీధర్ కూడా నటుడే. నా భార్య గృహిణి. మా ఇద్దరు అబ్బాయిలు చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నేను అన్నయ్య ఇద్దరం బాగా హైట్, అవసరమైన ఫీచర్స్‌తో ఉండడం వల్ల అందరూ మోడలింగ్‌వైపు ప్రోత్సహించారు. గ్రాసిం మిస్టర్ ఇండియా పోటీల్లో ఎపి నుంచి ఫైనలిస్ట్‌గా నిలిచాను. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు బాగా వచ్చాయి. బిజీ అయ్యాను. మోడల్‌గా రాణిస్తున్న సమయంలోనే కృష్ణవంశీ గారు చూసి ఖడ్గం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మూవీ ఆఫర్లు ఏవీ పెద్దగా రాలేదు. దాంతో మోడల్‌గా కంటిన్యూ అయ్యాను. యువ...బ్రేక్ ఖడ్గం విడుదలైన నాలుగేళ్ల తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్లు తీసిన టీవీ సీరియల్ ‘యువ’లో అవకాశం వచ్చింది. పెద్ద బ్యానర్ కావడంతో చేశాను. అది చాలా మంచి యూత్‌ఫుల్ సబ్జెక్ట్. అప్పట్లో సీరియల్స్ అంటే ఆడవాళ్లు, ఏడుపులు మాత్రమే అనుకునే సమయంలో చాలా అడ్వాన్స్డ్ ఆలోచనలతో తీసిన సీరియల్ అది. అందులో ప్రస్తుత దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క వంటి వారు కూడా కనిపిస్తారు. ‘యువ’ సీరియల్‌తో స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు వస్తుండడంతో ఇక సినిమాల గురించి మర్చిపోయి టీవీలోనే కంటిన్యూ అయిపోయాను. గరుత్మంతుడిగా... ఎన్ని పాత్రలు చేసినా ఎస్వీబీసీ చానెల్ కోసం చేసిన ‘శ్రీవైనతేయం’ భక్తి సీరియల్లో గరుత్మంతుడి పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఆ పాత్ర కోసం బాగా కష్టపడ్డాను. కృత్రిమ ముక్కు వగైరాలతో మేకప్‌కి రెండు గంటలు పట్టేది. ఇప్పటికీ తిరుపతిలో కంపార్ట్ మెంట్స్‌లో మనం కూర్చున్నప్పుడు గరుత్మంతుడి చిత్రం ప్రదర్శిస్తుంటారు. కొంత కాలం తర్వాత నేనూ అదే కంపార్ట్మెంట్లో కూర్చుని అదే సీరియల్ చూడడం భలే వింతైన అనుభవం. అది కాక లవ్, అపరంజి, భార్యామణి, కుంకుమరేఖ ఇలా ఎన్నో సీరియల్స్ చేశాను. ‘రామసీత’ సీరియల్ బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ జనం నన్ను రామసీత వాసుదేవ్ అనే పిలుస్తుంటారు. మల్లీశ్వరి సీరియల్లో మగాడిగా శరీరం ఉన్నా, మనస్తత్వం అంతా అమ్మాయిలా ఉండడం వంటి విచిత్రమైన రాజకీయ నేత పాత్ర పోషించాను. ఇదే నా తొలి నెగిటివ్ క్యారెక్టర్. ఇది కూడా నాకు బాగా నచ్చిన పాత్ర. ప్రస్తుతం ’లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అక్కమొగుడు’ సీరియల్స్ చేస్తున్నా. ఇటీవలే ‘వశం’ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీలో ప్రధాన పాత్ర పోషించాను. దీనికి అమెజాన్ ప్రైమ్‌లో మంచి రివ్యూస్ వస్తున్నాయి. వెబ్ సిరీస్, సినిమాల మీద దృష్టి పెడుతున్నాను. మంచి ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. -
నా ప్రేమ నువ్వేనా
వాస్దేవ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో ప్రేమ నువ్వేనా’. జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లోగోని సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆవిష్కరించి, బెస్ట్ విషెష్ చెప్పారు. వాసుదేవ్ మాట్లాడుతూ –‘‘న్యూ ఏజ్ అండ్ డిఫరెంట్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే పాటలను విడుదల చేసి, సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రాశీ సైనా, సంజయ్ శివలింగమ్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్. -
వీడని వాసుదేవ్ హత్య మిస్టరీ
హైదరాబాద్ : మలేషియాలో వ్యాపారి వాసుదేవ్‌సింగ్ రాజ్‌పురోహిత్‌ను కిడ్నాపర్లే హత్య చేశారా? లేక కిడ్నాపర్ల నుంచి తప్పించుకునే యత్నంలో మృతిచెందాడా? అన్న అంశాలపై స్పష్టత రాలేదు. కిడ్నాపర్లు మలేషియాలోని కౌలాలంపూర్‌లో వాసుదేవ్‌ను బందీగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే బాత్రూమ్కు వెళ్లిన వాసుదేవ్ వెంటిలేటర్ నుంచి పారిపోయేందుకు యత్నించి రెండస్థుల భవనంపై నుంచి కింద పడి మృతిచెందగా, స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు కిడ్నాపర్లే రాడ్‌తో తలపై మోది హత్య చేశారన్న భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మలేషియా వెళ్లిన కుటుంబ సభ్యులు కూడ స్పష్టత ఇవ్వకపోవడంతో అతని మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. వాసుదేవ్ హత్య కేసులో మలేషియా పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు ఖాన్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఫేస్బుక్లో పరిచయమైన ఖాన్‌తో కొంత కాలంగా వాసుదేవ్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 1న మలేషియాలోని హోటల్ నుంచి ఖాన్ వెంట వెళ్లిన వాసుదేవ్ తిరిగిరాలేదు. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌కు వచ్చిన ఖాన్.. అతని సహచరులను వాసుదేవ్ ఎక్కడని ప్రశ్నించాడు. నీ వెంటనే తీసుకెళ్లావు కదా అనగా.. తాను మధ్యాహ్నమే అతన్ని వదిలివెళ్లానని సమాధానమిచ్చాడు. అనంతరం ఖాన్ కూడా తిరిగి కనిపించలేదు. ఈ క్రమంలో ఇదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఖాన్ ఫోన్ స్విచాఫ్ కావడంతో వారు విషయాన్ని హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు తెలిపి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాసుదేవ్‌సింగ్ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున ఈసీఐఎల్ మహేశ్‌నగర్‌లోని అతని ఇంటికి చేరింది. మధ్యాహ్నం కుషాయిగూడలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్తను, తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోలార్ జిల్లా శ్రీనివాసపురాలో శనివారం రాత్రి ఈ హత్య జరిగింది. తన కజిన్ వాసుదేవతో ప్రేమాయణం సాగిస్తున్న శిల్పారెడ్డి, అతనితో పారిపోయి విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంది. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని పథకం వేసింది. భర్త కేశవరెడ్డికి పళ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి,అనంతరం పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేసింది. తర్వాత ప్రియుడు వాసుదేవ సహాయంతో మృతదేహాన్ని సమీపంలోని నదిలో పడేసింది. తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త సోదరుడు తిరుమలకి ఫోన్ చేసి కేశవరెడ్డి క్షేమ సమాచారాల గురించి ఆరా తీసింది. సాధారణంగా ఎప్పడూ తనకు ఫోన్ చేయని వదిన ఫోన్ చేయడంతో మరిదికి అనుమానం తలెత్తింది. దీనికితోడు ఆమె అసాధారణ ప్రవర్తనతో అనుమానం మరింత బలపడింది. ఈ విషయాన్ని పోలీసుల చెవిన వేద్దామనకున్నాడు. ఈలోపు ఆదివారం నదిలో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి ఐడీ కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతుడిని కేశవరెడ్డిగా తేల్చారు. అటు అనుమానాస్పద మరణం, ఇటు మృతుని సోదరుడు ఇచ్చిన సమాచారం.. ఈ నేపథ్యంలో కేశవరెడ్డిది హత్యగా అనుమానించిన పోలీసులు శిల్పారెడ్డి సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఆమెను తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం తెలిసింది. తమ విచారణలో శిల్ప తాను చేసిన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, గురువారం శిల్పను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ హత్యా నేరంలో శిల్ప తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టు వారు గుర్తించారు.