vasundhara raje government
-
మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి
జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. -
వసుంధర ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్!
జైపూర్: వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం.. రిజర్వేషన్ల కోటా పెంపు చెల్లదని హైకోర్టు కొట్టిపారేసింది. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వసుంధర రాజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. వాస్తవానికి రాజస్థాన్ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోయింది. గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్ల కోటా కలిపి 50 శాతం దాటకూడదు. అయితే సమస్యలు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోవడం కారణంగా రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తూ.. రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది. -
అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!
రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి ఆమోదించారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు. అయితే, తాము కొత్తగా ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూడాలని రాజస్థాన్‌లోని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే.. అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక్కరోజు తర్వాతే రాజస్థాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.