జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు.
ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment