కూటమి నేతల లేఖలతో టీచర్ల డిప్యుటేషన్లకు రంగం సిద్ధం
ఈ బదిలీలకు పని సర్దుబాటు ముసుగు
మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది
బదిలీలు 1:20 నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
5 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగే అవకాశం?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తి కావాల్సి ఉండగా టీచర్, విద్యార్థుల నిష్పత్తి, సర్వీస్, స్టేషన్ అంశాల్లో ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై తర్జనభర్జనతో బదిలీలను సోమవారానికి వాయిదా వేశారు. పైకి మాత్రం పని సర్దుబాటు ఆధారంగా బదిలీలు అని చెబుతున్నా అంతర్గతంగా కూటమి నేతలకు కాసులు కురిపించే ప్రక్రియగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సిఫారసు లేఖలతో వచ్చిన వారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రులు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే అదనుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిఫారసు లేఖలతో మండలం, జిల్లా కేంద్రాలకు లేదంటే సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుండటంతో భారీగా అక్రమాలకు ఆస్కారముందని పలు ఉపా«ద్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తం 29,992 మంది ఉపాధ్యాయులు మిగులు కనిపిస్తుండగా ఈ ఏడాది ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారు 2 వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలని విద్యాశాఖ నిబంధన తేవడంతో గరిష్టంగా 4 వేల నుంచి 5 వేల మందికి బదిలీకి అవకాశముంది. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీల నుంచి మినహాయించారు.
బదిలీలు 1: 20 ప్రకారం చేయాలని డిమాండ్
ఇటీవల ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్‌లో సిబ్బంది సర్వీసు వివరాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్ జోడించారు. దీనిద్వారా ఉపాధ్యాయులంతా తమ సర్వీస్ రికార్డు వివరాలను నమోదు చేశారు. ఈ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు (సబ్జెక్టు టీచర్లు) 8,773 మంది, ఎస్‌జీటీలు 20,469 మంది మిగులు ఉన్నట్టు తేల్చారు. ఎయిడెడ్‌లో మరో 750 మంది కలిపి మొత్తం మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది ఉన్నారు. సర్దుబాటు బదిలీల్లో భాగంగా 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ లెక్కన సర్దుబాటు చేస్తే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నష్టం జరుగుతుంది.
ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ నిష్పత్తిలో, ఉన్నత పాఠశాలలకు 1:45 నిష్పత్తిలో లేదా జీవో53 ప్రకారం ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసు్తన్నారు. దీనివల్ల 6 నుంచి 7 వేల మందికి అవకాశం లభిస్తుందంటున్నాదీనిపై ప్రభుత్వం స్పందించలేదు. సర్దుబాటు బదిలీల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీలతో చర్చించేందుకు రావాలని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించినప్పటికీ తామనుకున్న వి«దంగా ప్రక్రియ ముగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సర్దుబాటు బదిలీలు తొలుత రాష్ట్ర స్థాయిలో చేపట్టాలని నిర్ణయించినా అనంతరం జిల్లా స్థాయిలో మండల యూనిట్‌గా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి నేతలు దీన్ని ఆసరాగా చేసుకుని తమ సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిని కోరుకున్నచోటకు పంపించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment