వసుంధర ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్!
జైపూర్: వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం.. రిజర్వేషన్ల కోటా పెంపు చెల్లదని హైకోర్టు కొట్టిపారేసింది. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వసుంధర రాజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. వాస్తవానికి రాజస్థాన్ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోయింది.
గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్ల కోటా కలిపి 50 శాతం దాటకూడదు. అయితే సమస్యలు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోవడం కారణంగా రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తూ.. రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది.