పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం
ఏలూరు సిటీ : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని, కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పే బాధ్యత తానే తీసుకుంటానని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో వెమ్ ఏరోసిటీ పరిశ్రమకు శనివారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. తుందుర్రు ఆక్వా పార్క్‌ను ప్రజలు వ్యతిరేకిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. అయితే, జిల్లాలో ఎక్కడా కాలుష్యానికి అవకాశం ఇవ్వనని చెప్పారు. తుందుర్రు పరిశ్రమ గురించి పరోక్షంగా మాట్లాడుతూ అక్కడ మత్స్య ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తారని చెప్పారు. జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో, ఏయే పరిశ్రమలు ఉన్నాయో అధ్యయనం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తామని, రాజకీయ పార్టీలు, ప్రజలు మాత్రం వాటికి అడ్డుచెప్పవద్దన్నారు. తొలుత వెమ్ ఏరోసిటీ సీఎండీ వి.వెంకట్రాజు, భారత్ డైనమిక్ లిమిటెడ్ సీఎండీ వారణాసి ఉదయభాస్కర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, పితాని సత్యనారాయణ, వేటుకూరి శివరామరాజు, పులపర్తి రామాంజనేయులు, కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయు డు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మేయర్ షేక్ నూర్జహాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, అంబికా కృష్ణ, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.