వేదగోదావరికి దివ్యమంగళ హారతులు
భారతదేశం వేదభూమి. ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్యభూమి. సనాతన సంస్కృతీ సంప్రదాయాలను ఎనలేని శ్రద్ధాభక్తులతో పాటించే కర్మభూమి. పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని కూడా పూజించే ధన్యభూమి.
తమ పావన జలాల స్పర్శతో భక్తుల పాపాలను హరించే పుణ్యనదులు గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న తదితర పరమపావన తీర్థాలు. అటువంటి నదులను దేవతా స్వరూపాలుగా భావించి, ఆ జలాలకు దివ్యమంగళ హారతులు ఇచ్చే కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. ముఖ్యంగా గంగానదికి ప్రతిరోజూ జరిగే హారతి కన్నులపండువుగా ఉంటుంది. జీవనది అయిన గోదావరీ మాతకు కూడా ఇటీవలి కాలంలో హారతి ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టింది బుద్ధవరపు దాతృత్వ సంస్థ. గత నాలుగేళ్లుగా ఈ సంస్థవారు ప్రతి పున్నమినాడూ వేదపండితుల పవిత్ర మంత్రోచ్ఛారణతో అంగరంగ వైభవంగా గోదావరి నదికి హారతులు ఇస్తున్నారు.
వేలాదిమంది భక్తులు ఈ సుందర దృశ్యాన్ని కన్నులారా తిలకిస్తూ ఉండగా... సాక్షాత్తూ గోదావరీ మాతయే స్వయంగా ఈ హారతిని స్వీకరిస్తోందా అన్నట్లుగా జ లాలు పరవళ్లు తొక్కుతుంటాయి. షోడశ కళలు వర్థిల్లే పౌర్ణమినాడు ఆ కళలు ఉట్టిపడేట్లుగా అమ్మవారికి షోడశ హారతులు ఇస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సమవృష్టి ఉండేలా అమ్మవారికీ మహానీరాజనం సమర్పిస్తారు.
లోకకల్యాణాభిలాషతో అమ్మవారికి పదహారు రకాల హారతులు ఇస్తున్నారు. అవి 1.ఏకహారతి, 2. నేత్రహారతి 3. బిల్వహారతి 4. పంచహారతి 5. సింహ హారతి 6. నృత్యహారతి 7. సర్పహారతి 8. నాగహారతి 9. చక్రహారతి 10. సుదర్శన హారతి 11.ధూపహారతి 12. దీపహారతి 13. అఖండ కర్పూర హారతి 14. కుంభ హారతి 15.నక్షత్ర హారతి 16. ముద్దహారతి. సాక్షాత్తూ సప్తరుషులే ఈ హారతులు ఇస్తున్నట్లుగా ఏడుగురు వేదపండితులు అమ్మవారికి జేగంటానాదం చేస్తూ, మంగళవాయిద్యాలు ఇస్తూ... ఛత్రచామర వింజామరలతో, వేదమంత్రోచ్ఛారణతో ఈ పవిత్ర కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతోంది.
గత ముప్పై ఆరు నెలలుగా గోదావరి పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం కార్తికమాసం సందర్భంగా మరింత మంగళకరంగా జరగనుంది. అత్యంత పెద్ద బింబంగా, స్వచ్ఛమైన తెల్లని కాంతులతో వెన్నెలలు కురిపించే, కార్తిక పౌర్ణమినాడు ఈ హారతి కార్యక్రమం గోదావరీ మాత భక్తులకు కనువిందు చేయనుందని ట్రస్ట్ సమన్వయ కర్త ఇంద్రగంటి రామచంద్రగోపాలం అంటున్నారు.
- డి.వి.ఆర్.
కార్తిక సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైనఅగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.