Veerabhadram
-
డ్రగ్స్ కేసులో మరో టీడీపీ నేత హస్తం
-
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేష్ అగస్త్య కొత్త చిత్రం
‘పూలరంగడు’ ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'దర్శకులు వీరభద్రం చౌదరితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం' అన్నారు. -
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని, అంతా రాష్ట్రాలపైకి నెట్టిందని ఆరోపించారు. గత డిసెంబర్ 31 నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామన్నారని, అది ఇంకా నెరవేరలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ‘ఆర్థిక రంగంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ధరలు పెరుగుతున్నాయి. సంపద లూటీ అవుతోంది’అని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్ముకోండి.. పొలిటికల్ ఫండ్‌గా బీజేపీకి కేటాయించండని చెబుతున్నారని విమర్శించారు. దేశంలో 112 మంది మహా కోటీశ్వరులు ఉన్నారని, వారి చేతుల్లో ప్రజల వద్ద ఉన్న సంపదలో 55 శాతం ఉందని చెప్పారు. పార్లమెంటులో చర్చలే జరగవు రాజ్యాంగంలోని కీలక స్తంభాలను ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసి కేంద్రమే తన చేతుల్లోకి తీసుకుంటోందని ఏచూరి మండిపడ్డారు. ‘12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగవు. పార్లమెంటును రబ్బర్ స్టాంప్‌లా వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీలను తన రాజకీయ ఏజెన్సీలుగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. తనకు లొంగని ప్రతిపక్షనాయకుల మీద కేసులు పెడుతూ హింసిస్తోంది’అని విమర్శించారు. ఎన్నికల్లో ఏ పార్టీనైనా నెగ్గనీయండి.. కానీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అనడంపై మండిపడ్డారు. పార్టీ పాత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళల కోసం ఎర్రజెండా పోరాడుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక బంగారు తెలంగాణ తెస్తామని పాలకులు ఆశ చూపారని, కానీ ఆశలు అడియాసలయ్యాయని మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ రావాలన్నారు. బీజేపీ విషసర్పంలా ఎదుగుతోంది: తమ్మినేని రాష్ట్రంలో బీజేపీ విషసర్పంలా ఎదుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వార్డు స్థాయిలోకి కూడా వెళ్లిందని, విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతవిద్వేషాలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించారు. రాష్ట్ర మహాసభల్లో కూడా బీజేపీని అడ్డుకోవడమెలానో చర్చిస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరడంలేదని విమర్శించారు. కేంద్రంపై ఒక్కనాడైనా ఆయన పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. బీజేపీని రాజకీయ బేరసారాలకు, తన ప్రయోజనాలకు కేసీఆర్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను నమ్మలేకపోతున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సహా ఎవరు వచ్చినా కలిసి పోరాడతామని, దీనర్థం వాళ్లతో ఎన్నికల పొత్తులుంటాయని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ఊరుకోబోమన్నారు. రాబోయే కాలంలో వామపక్షవాదులతో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. -
‘కిరాతక’గా ఆది సాయికుమార్.. పాయల్‌తో రొమాన్స్‌కి రెడీ
ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాతక` అనే పవర్ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ - ‘ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి`` అన్నారు. చిత్ర నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ - ‘‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ఆది సాయికుమార్ , ఎం. వీరభద్రం గారి కాంబినేషన్లో `కిరాతక`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం’ అన్నారు. -
మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా
- సాయికుమార్ ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
'చుట్టాలబ్బాయి' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందీ సినిమా - నాగార్జున
‘‘హాస్పటల్ నుంచి నాన్నగారు ‘వాట్సప్’ ద్వారా ‘ఆల్ ది బెస్ట్ భాయ్ టీమ్’ అని మెసేజ్ పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వీరభద్రమ్ దర్శకత్వంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం ‘భాయ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘అహనా పెళ్లంట, పూలరంగడు సినిమాల్లో వీరభద్రమ్ కామెడీ టైమింగ్ నచ్చి ఈ కథ విన్నాను. వండర్ అనిపించింది. కేవలం స్క్రిప్ట్‌కే అయిదారు నెలలు పనిచేశాం. అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందీ సినిమా. వీరభద్రం మంచి పంచ్ డైలాగులు రాయించాడు. దేవిశ్రీతో ఇది నా అయిదో కాంబినేషన్. నా ప్రతి సినిమాకూ డిఫరెంట్ పాటలిచ్చాడు. ఈ జన్మకి దేవిశ్రీకు రుణపడి ఉంటాను. గీతరచయితలందరూ మంచి సాహిత్యం ఇచ్చారు. స్టార్స్ అని మమ్మల్ని అంటారు కానీ... నిజానికి తెరవెనుక ఉన్నవాళ్లే నిజమైన స్టార్స్. రిలయన్స్ సంస్థతో టై ఆప్ కావడంతో క్రమశిక్షణ అంటే ఏంటో తెలిసింది. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు సినీ నిర్మాణంలో పాలు పంచుకుంటే... పరిశ్రమకు క్రమశిక్షణ తెలుస్తుంది. ఇప్పుడు నాకూ వరుసగా సినిమాలు నిర్మించాలని ఉంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలో నాకు పెద్ద బ్రేక్‌ని ఇచ్చిన సినిమా ‘మన్మథుడు’. అప్పట్నుంచి మా కలయిక సూపర్‌హిట్టే. వీరభధ్రమ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొన్ని పంచ్ డైలాగులు కూడా చెప్పాడు. వాటిని బట్టే ‘బీహెచ్ఏఐ భాయ్’ టైటిల్ సాంగ్ చేసి వెంటనే వినిపించా. ఓ హీరో వేరే హీరో సక్సెస్ గురించి మాట్లాడటం అరుదు. కానీ నాగ్ అందుకు అతీతుడు. రీసెంట్గా జరిగిన ‘భాయ్’ వేడుకలో ‘అత్తారింటికి దారేది’ గురించి, నా గురించి అభినందనీయంగా మాట్లాడారు. ఇలాంటి మాటలు పరిశ్రమలో మంచి వాతావరణానికి నాంది పలుకుతాయి’’ అని దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. నాగార్జున చేతుల మీదుగా చిత్రం యూనిట్‌కి డిస్క్‌ల ప్రదానం జరిగింది. ఇంకా వీరభద్రమ్, హంసానందిని, జరాషా, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, ఆదిత్య ఉమేష్‌గుప్త, ఫైట్ మాస్టర్ విజయ్, రిలయన్స్ సీఎఫ్ఓ శభాషిష్ సర్కార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!
‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ విజయాలతో క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకున్న వీరభద్రమ్ ‘భాయ్’తో హ్యాట్రిక్ కొడతానంటున్నారు. తన మూడో సినిమానే నాగార్జునలాంటి అగ్ర హీరోతో చేసే అవకాశం రావడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వీరభద్రమ్ సంతోషం వెలిబుచ్చారు. ‘భాయ్’ ఈ 25న విడుదలవుతున్న సందర్భంగా వీరభద్రమ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. *** మరో మూడు రోజుల్లో ‘భాయ్’ రిలీజ్‌కి రెడీ. ఎలా అనిపిస్తోంది? పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్‌లా ఉంది నా పరిస్థితి. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వంద శాతం ఉంది. అయితే ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలనే ఉద్వేగం ఎక్కువగా ఉంది. *** దర్శకుడిగా ఇప్పటికి రెండు పరీక్షలు రాసి, పాసయ్యారు. కానీ, ఇది పెద్ద పరీక్ష కదా? నిజమే! నాగార్జునగారు హీరోగా నటించడానికి అంగీకరించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై ఆయనే నిర్మించారు. ఇది చిన్న విషయం కాదు. పైగా, నా గత చిత్రాలకన్నా ఇది పెద్ద బడ్జెట్ చిత్రం. అందుకే ‘భాయ్’ని ఓ సవాల్‌గా తీసుకున్నా. కచ్చితంగా ఈ పెద్ద పరీక్ష కూడా నాకు మంచి అనుభూతినే మిగులుస్తుంది. నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను గ్యారంటీగా హిట్ అనే నమ్మకంతో ఉండేవాణ్ణి. కానీ, అందరూ ‘ఓకే.. మాములుగా ఆడుతుంది’ అనుకునేవాళ్లు. అయితే, అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పూలరంగడు’ సూపర్ హిట్ అవుతుందన్నాను. అప్పుడూ ‘ఓకే... ఏదో హిట్ అవుతుంది’ అనుకున్నారు. అది కూడా ఘనవిజయం సాధించింది. దాంతో నా ఆలోచనలు, నా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయనే నమ్మకం రెట్టింపు అయ్యింది. *** మీకు మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసని నాగార్జున అన్నారు. ఆ మాస్ పల్స్ ఎలా పట్టుకోగలిగారు? నేను విలేజ్ నుంచి వచ్చినవాణ్ణి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అందుకని అటు విలేజ్, ఇటు సిటీ లైఫ్ నాకు తెలుసు. మాస్, క్లాస్.. రెండు రకాల వ్యక్తులతో నాకు పరిచయాలున్నాయి. అందుకని వాళ్ల మనసులను తెలుసుకునే వీలు కలిగింది. పైగా నాలోనూ ఓ మాస్ ప్రేక్షకుడు ఉన్నాడు. ఆ విధంగా నాకు మాస్ పల్సే కాదు. క్లాస్ పల్సూ తెలుసు! *** నాగార్జున గారితో పనిచేయడం గురించి? నాగార్జునగారు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండు, మూడు రోజులు స్వీట్షాక్లో ఉండిపోయాను. మొదటి షెడ్యూల్ బ్యాంకాక్‌లో చేశాం. ఓ మూడు, నాలుగు రోజులు బెరుగ్గా చేశాను. కానీ, నాగార్జునగారు ఇచ్చిన స్వేచ్ఛతో ఆ తర్వాత బెరుకుతనంపోయింది. దాంతో బాగా చేయగలిగాను. ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చారు నాగార్జునగారు. *** ఏడేళ్ల క్రితమే ‘భాయ్’ కథ అనుకున్నానని చెప్పారు... మరి, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందా? నేను ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కి కో-డెరైక్టర్‌గా చేశాను. హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’కి అది రీమేక్. ఆ టైటిల్లోని ‘భాయ్’ నాకు క్యాచీగా అనిపించింది. అప్పుడే ఆ టైటిల్ అనుకుని, స్టోరీలైన్ తయారు చేసుకున్నా. నాకు తెలిసి కొత్త కథలంటూ పుట్టవు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో వచ్చిన కథలే రిపీట్ అవుతున్నాయి. కాకపోతే కథనం, కథలోని ఎమోషన్స్, డైలాగ్స్, సాంగ్స్ పరంగా ట్రెండ్ మారుతుందని నా ఫీలింగ్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ‘భాయ్’ చేశాను. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది. నాగార్జునగారి స్టయిల్‌కి అనుగుణంగా కథను మలిచాను. *** ఏడేళ్ల క్రితం అనుకుని, ఈ మధ్యే నాగార్జునని అప్రోచ్ అయ్యారెందుకని? దర్శకుడిగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే, రెండు విజయాల తర్వాత నాగార్జునగార్ని కలిశాను. ఆయన ‘షిరిడీ సాయి’ సినిమా చేస్తున్న సమయంలో, సాయిబాబా గెటప్‌లో ఉండగా, కలిశాను. టైటిల్ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. దాదాపు గంటన్నర కథ విని, చేద్దాం అన్నారు. *** ‘మొదట ట్రెండ్ సెట్ చేసింది నువ్వే కదన్నా..’ అనే డైలాగ్ ఈ సినిమాలో పెట్టడానికి కారణం? ఇది ఏ హీరోనీ ఉద్దేశించి పెట్టింది కాదు. ఈ డైలాగ్ కూడా ఎప్పుడో అనుకున్నదే. అప్పట్లో ‘శివ’తో నాగార్జునగారు ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాకి కనెక్ట్ చేసి, ఈ డైలాగ్ రాశాను. *** మీ తదుపరి చిత్రాలు? రెండు పెద్ద సినిమాలున్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతా. -
'అత్తారింటికి దారేదీ' కంటే 'భాయ్' పాటలు బాగుంటాయి
'అత్తారింటికి దారేది' పాటలు కంటే 'భాయ్' సినిమా పాటలు బాగున్నాయని నటుడు నాగార్జున తెలిపారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని నాగార్జున వివరించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వీరభద్రం దర్శకత్వం లోరవితేజ?
‘బలుపు’తో బాక్సాఫీస్ వద్ద తన తడాఖా చూపించిన రవితేజ... ఆ చిత్ర కథా రచయిత బాబీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం నాగార్జున ‘భాయ్’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్న వీరభద్రం... మరో వైపు రవితేజ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘భాయ్’ స్టిల్స్
నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, ఫేస్బుక్ పేజ్, అన్నపూర్ణ స్టూడియో వెబ్‌సైట్‌ను నాగార్జున ఆవిష్కరించారు. -
'భాయ్' ఫస్ట్ లుక్ స్టిల్స్
అక్కినేని నాగార్జున తాజా చిత్రం భాయ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వైవిధ్యంగా ఉన్న మూడు స్టిల్స్ కూడా ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకర్సిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న భాయ్ చిత్రానికి దర్శకుడు వీరభద్రం. భాయ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Courtesy: https://www.facebook.com/AnnapurnaStudios