గీత దాటితే వాత!
సాక్షి, గట్టు: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. పోలీసులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలను విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో భయం పుట్టుకుంది. ఒకప్పుడు నగర ప్రాంతాలకే పరిమితమైన ఈ–చలాన్ విధానాన్ని ఇప్పుడు పల్లెలకు విస్తరించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ–చలాన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు ఈ–చలాన్ ద్వారా జరిమానాలు వెంటాడుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలను చేపడుతున్న పోలీసులు, నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, డ్రైవింగ్ నిబంధనల అమలుకు పోలీసులు కృషిచేస్తున్నారు. మోటార్ వాహనచట్టం 250 సెక్షన్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలను విధిస్తున్నారు.
నిత్యం వాహన తనిఖీలు..
ప్రధాన రోడ్ల వెంట స్థానిక పోలీసులు నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు–రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారితో పాటుగా గట్టు, మల్దకల్, గట్టు, ధరూరు, గట్టు చింతలకుంట, గట్టు మాచర్ల గ్రామాలకు సంబంధించిన ప్రధాన రహదారుల వెంట వాహన తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారులను నిలిపి, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. వాహనదారులను ట్యాబ్ ద్వారా ఫొటో తీసి, వాహన నిబంధన ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ట్యాబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయగానే వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం ట్యాబ్ స్క్రిన్‌పై కన్పిస్తుంది. వాహనదారుడు ఏ నిబంధన ఉల్లంగించారనే దాని ప్రకారం వాహనదారునికి జరిమానా విధిస్తున్నారు. జరిమానాకు సంబంధించిన రశీదును అక్కడే వాహనదారునికి అందజేస్తున్నారు. ఆ తర్వాత వాహనదారుడు మీసేవ, ఈ సేవ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ సేవల ద్వారా జరిమానాను చెల్లించవచ్చు.
వీటికి జరిమానాలు..
పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు లేకపోవడం, వాహనానికి పిట్నెస్ లేకపోవడం, అధిక శబ్దాలు చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, ద్విచక్ర వాహనాలపై ము గ్గురు ప్రయాణించడం, నెంబర్ ప్లేటు సక్రమంగా లేకపోవడం, తనిఖీ సిబ్బందికి సహకరించకపోవడం వంటి అనేక కారణాలతో వాహనదారులకు అక్కడికక్కడే జరిమానాలను విధిస్తున్నారు.
ప్రమాదాల నివారణ కోసమే..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా జరిమానాలు విధించడమే కాకుండా వాహనదారులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. వాహన నిబంధనలు పాటిస్తూ.. అన్ని రకాల అనుమతులను వాహనదారులు కల్గి ఉండాలి. వాహనదారుడు అనుకోని విధంగా ప్రమాదం బారిన పడి, నష్టం జరిగితే, ఆ కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా పరిహారం అందించేందుకు వీలు పడుతుంది. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని అనుమతుల పత్రాలను కల్గి ఉండాలి. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా పత్రాలు, హెల్మెట్ లేకపోయినా జరిమానా విధిస్తున్నాం. ఇప్పటి దాకా గట్టు మండలంలో సుమారు 450 దాకా ఈ–చలాన్ ద్వారా జరిమానాలను విధించాం. ఎన్నికల దృష్ట్యా కర్ణాటక సరిహద్దులో ఉన్న బల్గెర దగ్గర ప్రత్యేకంగా చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేశాం. రూ.50 వేలకు మించి నగదును తరలిస్తూ, పట్టుబడితే ఆ డబ్బును సీజ్ చేస్తాం. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు ఉంటే తిరిగి వారికి అప్పగిస్తాం. – శ్రీనివాసులు, ఎస్ఐ, గట్టు