ఐఏఎస్ అవ్వాలమ్మా!
బాల మేధావి శ్రీజకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం
ఖమ్మం కల్చరల్: నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కితే ఆనందమే.. అదే సీఎం నుంచి ప్రశంసలు పొందితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఖమ్మం పట్టణానికి చెందిన బాల మేధావి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన వేల్పుల శ్రీజను ఈ అవకాశం వరించింది. ప్లీనరీ కోసం మంగళవారం రాత్రే ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్... గతంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీజ ఇంటికి వెళ్లారు. బ్లాక్‌టీ తాగి, 18 నిమిషాల పాటు అక్కడ గడిపారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రాజకీయ ప్రస్థానం గురించి శ్రీజ గడగడా చెప్పేయడంతో... సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, తుమ్మల ఆశ్చర్యపోయారు. శ్రీజను బాలమేధావిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కేసీఆర్ అభినందించారు. ‘ఐఏఎస్ కావాలి.. నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధించాలి..’ అని ఆశీర్వదించారు. శ్రీజను హైదరాబాద్‌లోని మంచి పాఠశాలలో చేర్పించేలా చూడాలని ఎంపీ కవితకు సూచించారు. ఇక ప్లీనరీలో శ్రీజకు అవకాశమిస్తే టీఆర్ఎస్ ఆవిర్భావ ఉద్దేశాన్ని రెండు నిమిషాల్లో చెప్పేస్తుందని ఆమె తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌ను కోరగా.. ఆయన సరేనని చెప్పారు.