‘పుర’ కౌంటింగ్ ప్రశాంతం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నాలుగు గంటల్లో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. ఈవీఎంల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫీగా లెక్కింపు జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం పూతలపట్టు మం డలంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరి గింది. ఉదయం 7.30 గంటలు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత పోలీసు అధికారులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచారు. సరిగ్గా 8 గంటలకు అన్ని మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
డివిజన్, వార్డులకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థి, లేని పక్షంలో అతని తరపున ఏజెంట్‌ను అనుమతించారు. తొలుత లెక్కించిన బ్యాలెట్ ఓట్ల లో చాలా చెల్లని ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులకు బ్యాలెట్ ఓట్లు నిరాశనే మిగిల్చాయి. తర్వాత ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మున్సిపాలిటీల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. అత్యధికంగా మదనపల్లి మున్సిపాలిటీకి 12 టేబుల్స్ వేశారు.
మిగిలిన మున్సిపాలిటీలకు 6 నుంచి 8 టేబుల్స్, చిత్తూరు కార్పొరేషన్‌కు మాత్రం 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోని తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు ముగిసింది. తర్వాత రౌండ్లు వెంటవెంటనే చేపట్టడంతో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల ఓట్లు లెక్కింపు 10.45 గంటలకు పూర్తి చేశారు. అయితే నగరి మున్సిపాలిటీ మాత్రం 11.15 నిమిషాలకు ముగిసింది. ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని డివిజన్లు సంబంధించి ఈవీఎం రిజల్ట్ బటన్ నొక్కినా నాట్ పోల్డ్ రావడంతో సాంకేతిక నిపుణుల సాయంతో వాటిని సరిచేసి అభ్యర్థులకు పోలైన ఓట్లు చూపించారు. రౌండ్లు వారీగా ఓట్లు లెక్కింపు చేపట్టడంతో గెలుపొందిన అభ్యర్థులతో కౌంటింగ్ కేంద్రం సందడిగా మారింది.
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థుల డిక్లరేషన్ ఫారాలను రిటర్నింగ్ అధికారులు కాకుండా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లు అందజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయా మున్సిపాలిటీల ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షించారు. మొత్తం మీద మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.