ఎముకలు కొరుకుతున్న చలి, ఆకలి మంటకు తట్టుకోలేక భిక్షాటన.. చివరికి!
సాక్షి, నల్గొండ: ఊహ తెలియని వయసు నుంచే సోదరితో పాటు అనాథాశ్రమంలో పెరిగాడు. ఏమైందో తెలియదు కానీ ఏడాది క్రితం సోదరి కూడా అతడిని విడిచి వెళ్లిపోయింది. దీంతో నెల రోజుల క్రితం ఆ బాలుడు ఆశ్రమం నుంచి బయటికొచ్చాడు. జానెడు పొట్ట కోసం లారీ క్లీనర్‌గా.. చివరకు బిచ్చగాడిగా మారాడు. అయినా ఎవరూ ఆదరించలేదు. ఓ వైపు ఆకలి మంట.. మరో వైపు నా అనే వారు ఎవరూ లేరనే మనస్తాపంతో తనువు చాలించాలని సాగర్‌లో కాల్వలోకి దూకాడు.
అటుగా వెళ్తున్న ఓ రేషన్ డీలర్ ఆ బాలుడిని కాపాడి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు ఊహ తెలియని వయసులోనే ప్రియాంక ఆమె సోదరుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఎస్ఓఎస్ ఆశ్రమంలో వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్కడే ఆశ్రయం పొందారు.
చదవండి: హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్
ఒంటరయ్యానని..
ఏడాది క్రితం ప్రియాంక ఆశ్రమం వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంటరివాడయ్యాడు. దీంతో నెల రోజుల క్రితం ఆశ్రమం నుంచి పారిపోయాడు. మూడురోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరిగిన శ్రీకాంత్ హైవేపైకి చేరుకుని లారీ ఎక్కాడు. 20 రోజుల పాటు అదే లారీకి క్లీనర్‌గా పనిచేశాడు. ఆ లారీడ్రైవర్ మూడు రోజుల క్రితం తిప్పర్తి మండల కేంద్రంలో శ్రీకాంత్‌ను దింపి వెళ్లిపోయాడు.
చలికి వణుకుతూ .. ఆకలికి తట్టుకోలేక..
లారీడ్రైవర్ విడిచిపెట్టినప్పటి నుంచి శ్రీకాంత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ వైపు ఎముకలు కొరుకుతున్న చలి, మరో వైపు ఆకలి మంటకు తట్టుకోలేకపోయాడు.దీంతో చేయిచాచి భిక్షాటన చేశాడు. అయినా ఆదరణ కరువవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వేములపల్లి మండల కేంద్రానికి చేరుకున్న శ్రీకాంత్ సాగర్ ఎడమ కాల్వలోకి దూకాడు. నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని గమనించిన రేషన్ డీలర్ అమరారపు వెంకటయ్య తాడు సహాయంతో ఒడ్డుకు లాగి కాపాడాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి వివరాలు తెలుసుకుని పోలీసులకు అప్పగించాడు. బాలుడి గురించి ఆరా తీసి అప్పగిస్తామని ఎస్ఐ రాజు తెలిపారు. అప్పటి వరకు ఆ బాలుడికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
చదవండి: ఏడేళ్లుగా ప్రేమ.. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే. మరో అమ్మాయితో..