రామయ్య పెళ్లికి..మండపేట బోండాలు
శ్రీరామ నవమినాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలో వినియోగించే కొబ్బరి బొండాలు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తరలనున్నాయి. రంగులను అద్ది, రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించిన ఈ బొండాలు వివాహ వేడుకలో సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామారెడ్డి 16 ఏళ్ల నుంచి ఏటా క్రమం తప్పకుండా కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు.
రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వతహాగా వివాహాది శుభకార్యాల్లో వినియోగించే కొబ్బరి బొండాలను అందంగా అలంకరిస్తుంటారు. అలా అలంకరించిన బొండాలను సీతారాముల కల్యాణ వేడుకకు కానుకగా అందజేయాలన్న రామారెడ్డి ఆకాంక్షే 2001 నుంచి భద్రాద్రికి బొండాలను తీసుకువెళ్లడాన్ని ఆనవాయితీగా చేసింది. శ్రేష్టమైన బొండాలను సేకరించి, వాటికి ఎనామిల్, వాటర్ పెయింట్లు వేసి, పూసలు, రాళ్లు, రిబ్బన్లవంటివాటితో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అలంకరణ పూర్తయ్యేందుకు దాదాపు 15 రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు.
ఎప్పటిలాగానే.. శంఖుచక్రాలు, తిరు నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా కొబ్బరి బొండాలను ముస్తాబు చేశామని, తాము తయారుచేసిన బొండాలను సీతారాముల పాదాల చెంత గొప్ప అనుభూతి కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో భద్రాద్రికి మాత్రమే బొండాలు పంపగా, ఇప్పుడు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ, సత్యవాడ తదితర పది ఆలయాలకు కానుకగా అందజేస్తున్నామన్నారు.
గత ఏడాది నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకకు కూడా పంపుతున్నామని, ఈ ఏడాది విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగే కల్యాణోత్సవానికీ పంపామని తెలిపారు. కాగా రామారెడ్డి దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన బొండాలతో గురువారం సాయంత్రం భద్రాద్రి బయలుదేరి వెళ్లారు.