స్టడీటూర్ విషాదం మిగిల్చింది..
సాక్షి, మంచిర్యాల/కాగజ్‌నగర్ రూరల్/నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్/లోకేశ్వరం : స్టడీటూర్ విషాదం మిగిల్చింది.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘటన రాష్ర్టవ్యాప్తంగా కలకలం రేపింది.. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లు సమాచారం లేకుండా ఎత్తడంతో ఫొటోలు దిగుతున్న 24 మంది విద్యార్థులు గల్లంతవడం విషాదకరం. గల్లంతైన వారు హైదరాబాద్‌లోని బాచుపల్లి విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాను.
ఈ ఘటన 24 మంది కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఈ స్టడీ టూర్‌కు వెళ్లిన వారిలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఒకరు కాగజ్‌నగర్‌కు చెందిన వెంకటసాయిశ్రీకర్, మరొకరు నిర్మల్ మండలానికి చెందిన హర్షపూర్ణశేఖర్. వీరిద్దరూ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన విషాదకర విషయాలు వారి మాటల్లోనే..
పాదరక్షలు ప్రాణాలు కాపాడాయి..
నా పేరు వెంకటసాయిశ్రీకర్. మాది కాగజ్‌నగర్ మండల కేంద్రం. మా నాన్న జీపీఆర్వీ ప్రసాద్. సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తారు. మా అమ్మ కనకదుర్గమ్మ. నేను హైదరాబాద్‌లోని బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్జోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్‌స్ట్రూమెంటేషన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నా. కాలేజీ వారు స్టడీ టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేశారు. 48 మంది స్నేహితులం, ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈ నెల 3న కళాశాల నుంచి బయలుదేరాం. ఢిల్లీ వరకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లాం.
ఢిల్లీ, ఆగ్రా, సిమ్లాలో పర్యటించిన తరువాత ఆదివారం కులుమనాలీకి చేరుకున్నాం. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కులుమనాలీలోని బియాస్ నదిపై జలవిద్యుత్ కేంద్రం సందర్శించాం. మనాలీ-కీరాత్పూర్ హైవేపై ధాలోట్కు సమీపంలో బియాన్ నదీతీరంలో ఫొటోలు దిగుతున్నాం. అంతా సరదాగా గడుపుతున్నాం. కొందరు స్నేహితులు ఫొటోలు దిగేందుకు నదిలోకి దిగారు. వారి సరాదాలోనే ఉన్నారు. సాయం సంధ్య వేళ సూరీడు జారుకుంటుంటే వాతావరణం చాలా బాగుంది. నా స్నేహితులు నన్ను కూడా లోపలికి రమ్మన్నారు. కానీ నా పాదరక్ష రాయికి తట్టుకుని ఊడింది.
దీంతో బయటకు వచ్చి సరిచేసుకుంటున్నాను. సరిగ్గా 6.20 గంటల సమయంలో లార్జి ప్రాజెక్టు గేట్లు విప్పడంతో భారీ శబ్దంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా ముంచెత్తింది. నీరు రాకాసి అలలా పై కెగసి పడింది. మోకాళ్ల వరకు ఉన్న నీళ్లు ఒక్కసారిగా మనిషిపై నుంచి ప్రవహించాయి. ఫొటోలు దిగుతున్న స్నేహితులు దీనిని గమనించలేదు. ఆ ప్రవాహంలోనే చూస్తుండగానే కళ్ల ఎదుట కొట్టుకుపోయారు. రక్షిం చండి అని కేకలు వేశారు. అక్కడ కాపాడలేని పరిస్థితి. ఒకరి వెనుక ఒకరు ప్రవాహంలో కలిసి కనుమరుగయ్యారు. స్నేహితులు గల్లంతవడం బాధాకరం. దేవుడి దయవల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. విమానంలో హైదరాబాద్ బయలుదేరి వస్తున్నా.
అంతా మూడు నిమిషాల్లోనే.. - హర్షపూర్ణశేఖర్, విద్యార్థి
నా పేరు హర్షపూర్ణశేఖర్. మాది లోకేశ్వరం మండలం భాగాపూర్. మేమే ఐదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా నిర్మల్ మండలంలో ఉంటున్నాము. మా నాన్న గణేశ్ వైద్యారోగ్యశాఖలో పనిచేస్తాడు. మా అమ్మ విజయలక్ష్మి. నేను హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాను. ఈ నెల 2వ తేదీన పరీక్షలు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాము. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పర్యటించాం.
సాయంత్రం ప్రాజెక్టు వర్క్ ముగించుకున్నాం. డ్యాం కి ంది భాగంలో స్నేహితులందరం సరదాగా ఫొటో దిగుదామని ఆగాం. 24 మంది విద్యార్థులు కిందికి వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. కొంతమందిమి ఒడ్డున ఉన్నాం. ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు ఫొటోలు దిగుతున్న విద్యార్థులతో ఉన్నారు. పది నిమిషాల అనంతరం అధ్యాపకుడు ఒడ్డుపైకి వస్తున్నాడు. మిగిలిన 24 మంది విద్యార్థులు డ్యాం కింది భాగంలోనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. రెండు, మూడు నిమిషాల్లోనే విద్యార్థుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.
అసలేం జరుగుతోందోనని విద్యార్థులు తేరుకునే లోపే 24 మంది స్నేహితులు కళ్ల ముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. షాక్ నుంచి మేమంతా తేరుకునే లోపే స్నేహితులు దూరమయ్యారు. అయితే డ్యాం గేట్లు ఎత్తివేసే సమయంలో సైరన్ మోత వంటి ప్రమాద హెచ్చరికలు వినిపించలేదు. సైరన్ మోత వినిపించి ఉంటే స్నేహితులు దక్కేవారేమో.