ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
నిజామాబాద్ లీగల్ (నిజామాబాద్ అర్బన్): బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో నిందితులైన ఇద్దరు అధికారులను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ2 నిందితుడు సింహాద్రి వెంకట సునీల్‌బాబు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం మేరకు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావు, రిటైర్టు సీటీవో నారాయణదాస్ వెంకట కృష్ణమాచారిలను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ధరణి శ్రీనివాస్‌రావు హైదరాబాద్‌లో అప్పిలేట్ డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తుండగా, నారాయణదాస్ 2012 నుంచి 2016 వరకు నిజామాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.
ఈ సమయంలో బోధన్‌లో జరిగిన నకిలీ చాలన్లకు సహకరించాలని ఇందుకు నెలకు రూ. 5 లక్షలు ఇచ్చినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. రిటైర్డు సీటీవోకు తమకు సహకరించాలని కారు కొనిచ్చినట్లు తెలిపాడు. శ్రీనివాస్‌రావు ఇంట్లో విలువైన ఫర్నిచర్ చేయించినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ మేరకు సీఐడీ అధికారులు వారిని అరెస్టు చేసి సోమవారం నిజామాబాద్ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సరిత ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వీరికి ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.