venkataramanamma
-
వివాహిత ఆత్మహత్య
అనంతపురం : నగరంలోని తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటరమణమ్మ (45) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దులచెరువుకు చెందిన సూర్యనారాయణరెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు. అనంతపురానికి వలస వచ్చిన వీరు తపోవనం బైపాస్ సర్కిల్లో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి జీవన్‌రెడ్డి, కల్పన సంతానం. కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. వెంకటరమణమ్మ తండ్రి నారాయణరెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి ఆమె బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వెంకటరమణమ్మ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం అందించారు. ఆయనతో పాటు స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సాగర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కాల్వలో దిగి ఇద్దరు చిన్నారులు మృతి
డక్కిలి : అప్పటి వరకు కంటి ముందు తిరిగిన అన్నదమ్ములు ఆడుకొనేందుకు వెళ్లి శవాలై తిరిగొచ్చారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ సంఘటన డక్కిలి మండలంలోని వెలికల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వెలికల్లు అరుంధతీయవాడకు చెందిన లచ్చా పోలయ్య, వెంకటరమణమ్మలు దంపతులు. పోలయ్య కూలి పనిచేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాలాజీ (7), రెండో కుమారుడు కుమార్ (5) స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడి కావడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు. తల్లికి మూగ, చెవుడు కావడంతో.. బాలాజీ, కుమార్ ఇంట్లో కొంతసేపు ఉన్న తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నామని తల్లికి చెప్పారు. అయితే వెంకటరమణమ్మకు మూగ, చెవుడు ఉండటంతో పిల్లలు చెప్పిన విషయం ఆమెకు అర్థంకాలేదు. తండ్రి ఈ సమయంలో కూలికి వెళ్లి ఉండటంతో ఎవరూ అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు. ఇద్దరూ కాలనీ సమీపంలోని తెలుగు గంగ మూడో బ్రాంచి కాలువ వద్దకు ఆడుకొనేందుకు వెళ్లారు. కొంతసేపటికి ప్రమాదవశాత్తు అన్నదమ్ములు కాలువలో పడి మృతిచెందారు. అటుగా పొలాల్లోకి వెళ్తున్న ఓ మహిళ కాలువలో పిల్లల మృతదేహాలు తేలుతుండటం గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి ఇంటికి తీసుకొచ్చారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు : చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కడుపుకోతతో తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వెంకటరమణమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మూగ, చెముడు ఉన్నప్పటికీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆమె బాధ స్థానికుల చేత కన్నీరు పెట్టించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ : ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతిచెందారనే విషయాన్ని తెలుసుకొన్న వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఏఎస్సై నారాయణ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా బాధిత తల్లిదండ్రులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను అప్పగించేందుకు ఇష్టపడలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. -
ప్రాణాలు తీసిన పిడుగులు
ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో శుక్రవారం జిల్లా దద్దరిల్లిపోయింది. వర్షం పెద్దగా కురవకపోయినప్పటికీ ఉరుముల శబ్ధానికి ప్రజలు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. వేర్వేరు చోట్ల ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. చలివేంద్ర రోడ్డులోని ముత్తుకూరు పాత దళితవాడ సమీపంలో కత్తి వెంకటరమణమ్మ (25) కొత్తగా నిర్మించిన ఇంటిపై ఎక్కి శ్లాబుపై నీళ్లు పడుతుండగా పిడుగుపాటుకు గురైంది. ఆ షాక్‌కు ఆమె ఇంటిపై నుంచి కిందపడి అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరులో ఉంటున్న వెంకటరమణమ్మ ఓటు వేసేందుకు భర్త సుబ్రహ్మణ్యంతో పాటు మూడు రోజుల క్రితం ముత్తుకూరుకు వచ్చింది. అనేకపల్లిలో ఒకరు వెంకటాచలం: అనికేపల్లికి చెందిన జానబోయిన వెంకటరమణయ్య(35) పశువులను మేత కోసం పొలాల్లోకి తోలుకెళ్లాడు. ఆయన కు సమీపంలోనే పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రమణయ్యకు భార్య గాయత్రి, పిల్లలు ప్రదీప్, ప్రవీణ్ ఉన్నారు. ఇంటిపెద్ద మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. అందరితో కలివిడిగా ఉండే వెంకటరమణయ్య చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కావలిలో మూగజీవాలు కావలిఅర్బన్: పట్టణంలోని పెంకులఫ్యాక్టరీ గిరిజనకాలనీలో పిడుగుపాటుకు ఇస్సారపు రమణయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు కోళ్లు మృతి చెందాయి. సుమారు రూ.70 వేలు నష్టపోయానని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతానికి చెందిన బండ్లమూడి కేశవులకు చెందిన 9 గొర్రెలు కూడా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోవడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతతో గౌరవరంలో విద్యుత్ తీగలు రాసుకుని నిప్పురవ్వలు సమీపంలోని గడ్డివాములు, పూరిళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఏడు గడ్డివాములు, రెండు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. -
నీళ్ల కోసం ఘర్షణ
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: బి.కొత్తకోటలోని అటుకో కాలనీకి నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్‌ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. బుధవారం నీళ్లట్యాంకర్ కాలనీకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న వెంకట్రమణ భార్య లక్ష్మమ్మ(60) ట్యాంకర్ వద్దకు నీళ్లు పట్టుకునేందుకు వెళ్లింది. ఒక్కో కుటుంబానికి 6 బిందెలు చొప్పున నీళ్లు వదిలారు. అయితే నరసింహులు భార్య రమణమ్మకు, చాకలి వెంకట్రమణ భార్య శిల్పకు 15బిందెల నీళ్లు వదిలారు. ఇది గమనించిన లక్ష్మమ్మ ఇదేమి న్యాయం అని ట్యాంకర్ తీసుకువచ్చిన వ్యక్తిని ప్రశ్నించింది. తమకు కూడా15 బిందెల నీళ్లు వదలాలని డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించాడు. నీళ్ల విషయంలో రమణమ్మ,శిల్ప,లక్ష్మమ్మల మధ్య వివాదం తలెత్తింది. ఉదయం జరిగిన వివాదాన్ని రమణమ్మ,శిల్ప రాత్రి ఇంటికి వచ్చిన భర్తలకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన నరసింహులు, అతని కుమారుడు రాజా, చాకలి వెంకట్రమణ, సుధాకర్, విష్ణు తదితరులు లక్ష్మమ్మ ఇంటికి వెళ్లారు. కులంపేరుతో దూషించారు. రాజ గొడ్డలితో లక్షమ్మపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనిని గమనించి ఆమె బంధువులు వెంకటరమణమ్మ(25)కదిరప్ప(25),లక్ష్మన్న(34) వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై కూడా నరసింహులు,తదితరులు దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మమ్మను ఆమె బంధువులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బి.కొత్తకోట ఎస్ఐ సుకుమార్ దాడిచేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రాఘవరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని విచారించారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండుకు పంపిస్తామని చెప్పారు.