ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో శుక్రవారం జిల్లా దద్దరిల్లిపోయింది. వర్షం పెద్దగా కురవకపోయినప్పటికీ ఉరుముల శబ్ధానికి ప్రజలు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. వేర్వేరు చోట్ల ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి.
చలివేంద్ర రోడ్డులోని ముత్తుకూరు పాత దళితవాడ సమీపంలో కత్తి వెంకటరమణమ్మ (25) కొత్తగా నిర్మించిన ఇంటిపై ఎక్కి శ్లాబుపై నీళ్లు పడుతుండగా పిడుగుపాటుకు గురైంది. ఆ షాక్‌కు ఆమె ఇంటిపై నుంచి కిందపడి అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరులో ఉంటున్న వెంకటరమణమ్మ ఓటు వేసేందుకు భర్త సుబ్రహ్మణ్యంతో పాటు మూడు రోజుల క్రితం ముత్తుకూరుకు వచ్చింది.
అనేకపల్లిలో ఒకరు
వెంకటాచలం: అనికేపల్లికి చెందిన జానబోయిన వెంకటరమణయ్య(35) పశువులను మేత కోసం పొలాల్లోకి తోలుకెళ్లాడు. ఆయన కు సమీపంలోనే పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రమణయ్యకు భార్య గాయత్రి, పిల్లలు ప్రదీప్, ప్రవీణ్ ఉన్నారు. ఇంటిపెద్ద మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. అందరితో కలివిడిగా ఉండే వెంకటరమణయ్య చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కావలిలో మూగజీవాలు
కావలిఅర్బన్: పట్టణంలోని పెంకులఫ్యాక్టరీ గిరిజనకాలనీలో పిడుగుపాటుకు ఇస్సారపు రమణయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు కోళ్లు మృతి చెందాయి. సుమారు రూ.70 వేలు నష్టపోయానని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతానికి చెందిన బండ్లమూడి కేశవులకు చెందిన 9 గొర్రెలు కూడా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోవడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతతో గౌరవరంలో విద్యుత్ తీగలు రాసుకుని నిప్పురవ్వలు సమీపంలోని గడ్డివాములు, పూరిళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఏడు గడ్డివాములు, రెండు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
ప్రాణాలు తీసిన పిడుగులు
Published Sat, May 10 2014 3:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement