డక్కిలి : అప్పటి వరకు కంటి ముందు తిరిగిన అన్నదమ్ములు ఆడుకొనేందుకు వెళ్లి శవాలై తిరిగొచ్చారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ సంఘటన డక్కిలి మండలంలోని వెలికల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వెలికల్లు అరుంధతీయవాడకు చెందిన లచ్చా పోలయ్య, వెంకటరమణమ్మలు దంపతులు. పోలయ్య కూలి పనిచేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాలాజీ (7), రెండో కుమారుడు కుమార్ (5) స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడి కావడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు.
తల్లికి మూగ, చెవుడు కావడంతో..
బాలాజీ, కుమార్ ఇంట్లో కొంతసేపు ఉన్న తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నామని తల్లికి చెప్పారు. అయితే వెంకటరమణమ్మకు మూగ, చెవుడు ఉండటంతో పిల్లలు చెప్పిన విషయం ఆమెకు అర్థంకాలేదు. తండ్రి ఈ సమయంలో కూలికి వెళ్లి ఉండటంతో ఎవరూ అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు. ఇద్దరూ కాలనీ సమీపంలోని తెలుగు గంగ మూడో బ్రాంచి కాలువ వద్దకు ఆడుకొనేందుకు వెళ్లారు. కొంతసేపటికి ప్రమాదవశాత్తు అన్నదమ్ములు కాలువలో పడి మృతిచెందారు. అటుగా పొలాల్లోకి వెళ్తున్న ఓ మహిళ కాలువలో పిల్లల మృతదేహాలు తేలుతుండటం గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి ఇంటికి తీసుకొచ్చారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు : చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కడుపుకోతతో తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వెంకటరమణమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మూగ, చెముడు ఉన్నప్పటికీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆమె బాధ స్థానికుల చేత కన్నీరు పెట్టించింది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ : ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతిచెందారనే విషయాన్ని తెలుసుకొన్న వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఏఎస్సై నారాయణ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా బాధిత తల్లిదండ్రులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను అప్పగించేందుకు ఇష్టపడలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.
కాల్వలో దిగి ఇద్దరు చిన్నారులు మృతి
Published Wed, Mar 16 2016 2:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement