తొమ్మిది నెలల తర్వాత వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో హత్యకు గురై.. నాగార్జునసాగర్ కాలువలో శవంగా తేలిన యువకుడి కేసును పోలీసులు తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్యతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చి జగద్గిరిగుట్ట సమీపంలో నివాసముంటున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు బాలిక తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది.
ఈ పోస్టులను బోరబండకు చెందిన వివాహితుడైన ఆటో డ్రైవర్ కుమార్ గమనించి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుమార్ బాలికకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక దగ్గర బంధించాడు.
ట్యాబ్ సాయంతో కనిపెట్టి..
తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో బాలిక ట్యాబ్‌ను ఓపెన్ చేసి కుమార్‌తో చేసిన చాటింగ్‌ను గుర్తించారు. దీంతో బాలిక తల్లి మరో స్త్రీగా సామాజిక మాధ్యమంలో ఆటో డ్రైవర్ కుమార్‌తో పరిచయం పెంచుకుని తమ ఇంటికి ఆహ్వానించింది.
ఆటోలో కుమార్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. కుమార్ రాగానే అతడిని బంధించి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. ఎంత బతిమిలాడినా కుమార్ ఆచూకీ చెప్పకపోవడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో కుమార్ అపస్మారకస్థితికి చేరడంతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కారులో విజయవాడ వైపు తీసుకొచ్చారు.
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల మేజర్ కాలువలో కుమార్‌ను పడేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు.
టెక్నాలజీ పట్టించింది..
మార్చిలో జరిగిన ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని తమకు ఏమీ తెలియనట్లు వారి పనులు వారు చేసుకోసాగారు. సదరు బాలిక కూడా హైదరాబాద్‌లోని నింబోలిఅడ్డాలోని ఓ అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సదరు బాలిక తండ్రి ఉపయోగిస్తున్నాడు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్‌ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్‌ను కూడా అలాగే ఉంచారు. ఈ ఆనవాళ్లతో 10 రోజుల క్రితం పోలీసులు ఆటోను పట్టుకొని దానిని ఉపయోగిస్తున్న బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటపడింది.
బోరబండ పోలీసులు రెండు రోజుల క్రితం కోదాడకు వచ్చి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తవ్వించారు. ఎముకలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపి అది కుమార్ మృతదేహమా.. కాదా అని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఒంటరిగా మారగా, కుమార్ భార్య భర్తను కోల్పోయి రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment