నగరంలోని తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటరమణమ్మ (45) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం : నగరంలోని తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటరమణమ్మ (45) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దులచెరువుకు చెందిన సూర్యనారాయణరెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు. అనంతపురానికి వలస వచ్చిన వీరు తపోవనం బైపాస్ సర్కిల్‌లో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి జీవన్‌రెడ్డి, కల్పన సంతానం. కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. వెంకటరమణమ్మ తండ్రి నారాయణరెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అప్పటినుంచి ఆమె బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వెంకటరమణమ్మ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం అందించారు. ఆయనతో పాటు స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సాగర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.