venugopalachary
-
సింగరేణి కొత్త గనులకు రూ. 6 వేల కోట్లు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం రూ.ఆరు వేల కోట్లు కేటాయించిందని, మరో రూ.6 వేల కోట్లు కేంద్రప్రభుత్వం కేటాయించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు అన్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3 కృషిభవన్, ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 సీహెచ్‌పీలో జరిగిన వేర్వేరు గేట్ మీటింగుల్లో కార్మికుల నుద్దేశించి ప్రసంగించారు. గోదావరి పరివాహక ప్రాంతం వెంట ఉన్న 160 కిలోమీటర్ల పొడవునా పలు నూతన గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు. కార్మికులు బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. జాతీయ సంఘాల మూలంగానే వారసత్వం పోయిందన్నారు. దీని ఆధారాలను సైతం కార్మికులకు చదివి వినిపించారు. మీ ప్రాంతంలో తిరిగే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చూసి ఓటెయ్యాని, పనిచేయకుంటే నిలదీయాలని పిలుపునిచ్చారు. మా యూనియన్‌గానీ, మేం గానీ, సరిగా పనిచేయకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించాలని కోరారు. -
100 కోట్లతో ‘బ్రాహ్మణ’ కార్పొరేషన్
ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి సాక్షి, న్యూఢిల్లీ: బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలంగాణలో త్వరలోనే రూ.100 కోట్లతో బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం ధన్వంతరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాలను ఒక్కటి చేసి బంగారు తెలంగాణ సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ధూపదీప నైవేద్య పథకం కింద రాష్ట్రంలోని ప్రతి అర్చకుడి ఖాతాలో రూ.6 వేలు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
'కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతం'
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన విజయవంతమైందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తాము ఎన్డీయేలో చేరుతామని వస్తున్న వార్తలు కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. కాగా ఎన్డీయేకు అంశాలవారీగా తమ మద్దతు కొనసాగుతుందని వేణుగోపాలాచారి పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమస్యల విషయంలోనూ, అలాగే ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ప్రభుత్వ చర్యలుంటే వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. -
ఖమ్మంలో 30 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు
భద్రాచలం : గోదావరి పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 30లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తోందన్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుష్కర ఘాట్లలో ఇప్పటివరకు 3.40కోట్ల మంది స్నానాలు ఆచరించారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులు, నిధుల కేటాయింపుపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి చర్చకు తీసుకొచ్చే విధంగా పోరాడతామన్నారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేయలేదని వేణుగోపాలచారి తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విదేశాల్లో బాబుకు భద్రత కల్పించింది ఎవరు?
న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ నాయకులు, ప్రజలకు భద్రత లేదన్న టీడీపీ మంత్రులపై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విరుచుకుపడ్డారు. భద్రత కోసం తమ రాష్ట్ర పోలీసులనే వినియోగించాలనే ఏపీ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. 'సింగపూర్, చైనా దేశాలలో పర్యటించిన సమయంలో చంద్రబాబుకు భద్రత కల్పించింది ఎవరు? అక్కడి ప్రభుత్వాలా? లేక ఏపీ పోలీసులా?' అని వేణుగోపాలాచారి ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమేనని, లై డిటెక్టర్ పరీక్షలు జరిపినా అదేవిషయాన్ని ఘంటాపథంగా చెబుతానని చారి అన్నారు.