వేసాక్ డే వేడుకల్లో పాల్గొన్న మోదీ
కొలంబో : రెండురోజుల శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ వేసాక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మోదీకి శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బౌద్ధుల అతి పెద్ద ఉత్సవం అయిన వేసాక్ డే ఉత్సవాలు ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో తొలిసారి కొలంబోలో జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజున బుద్ధునికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
మరోవైపు భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం భారత సంతతికి చెందిన తమిళులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. కాగా ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇది రెండోసారి.