బ్రహ్మోత్సవాలకు వేట వెంకన్న ముస్తాబు
గార్ల : మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గార్ల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 15 నుంచి అక్టోబర్ 21 వరకు నిర్వహించబోతున్నట్లు ఆలయ పూజారులు శేషుస్వామి, మధుస్వామి తెలిపారు. మండలకేంద్రమైన గార్లకు మూడు కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామం వద్ద వెలిసిన వేట వేంకటేశ్వరస్వామికి ప్రతీ ఏటా ఆశ్వయుజమాసంలో వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి వేంకటేశ్వరస్వామి స్వయంగా వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అవతరించారని భక్తుల విశ్వాసం.
సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన రామాయణం వెంగలయ్య అనే పేద చాత్తాద వైష్ణవునికి స్వామి దర్శనమిచ్చాడని, ఇక్కడ తనకొక ఆలయం నిర్మించి నిత్య దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలని వేంకటేశ్వరస్వామి ఆజ్ఞాపించగా వెంగలయ్య గ్రామ ప్రముఖుల సహకారంతో ఆలయం నిర్మించారని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు భూపాలపల్లి పట్టణంలోని ‘ఒంటిమీసం తోట’ అనే ఉద్యానవనంలో లభ్యం కాగా డోర్నకల్ సమీపంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన మల్లం గోపయ్య, మల్లం నర్సయ్య ఇక్కడకు తెచ్చి ప్రతిషి్ఠంచారు. నాటి నుంచి వంశపారంపర్యంగా అదే కుటుంబానికి చెందిన వారు స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో జంతుబలి ఇవ్వరు. కానీ మర్రిగూడెం వేంకటేశ్వరస్వామికి భక్తులు జంతుబలులు ఇవ్వడం విశేషం. ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, కృష్ణా జిల్లాలకు చెందిన భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారి కల్యాణం యాగ్నికము పూజారి కల్వకుంట్ల వెంకన్నచార్యులు, బుచ్చమయ్యచార్యులు నిర్వహిస్తారు.
ఈ నెల 15 రాత్రి గార్లలోని వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను మర్రిగూడెంలోని దేవాలయానికి తీసుకొచ్చి అంకురార్పణ జరుపుతామని ఆలయ పూజారి తెలిపారు. 16న ద్వజారోహణం, కల్యాణం, 17న హోమ బలిహరణ, 18న గరుడవాహనసేవ, 19న దేవాలయం ఎదుట కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం, 20న అశ్వవాహనసేన, 21న దోపోత్సవం, చక్రస్నానం, నాగబలిపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అర్చకులు శేషుస్వామి, మధుస్వామి కోరారు.