vetukuri venkata siva rama raju
-
బరిలో ఉంటా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నేత వేటుకూరి శివరామరాజు స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేసేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తన పట్ల చంద్రబాబు తీరు కలచివేసిందన్నారు. టీడీపీ అధిష్టానం తీరుతో కలతచెందిన శివరామరాజు మంగళవారం భీమవరంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని.. అధిష్టానం ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందానన్నారు. ఉండి నుంచి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అభ్యర్థి ఎంపిక విషయంలో తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. పదిహేను రోజులుగా పార్టీ నాయకత్వం కనీసం పట్టించుకుకోలేదన్నారు. అనుచరుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. -
టీడీపీలోనే ‘ఉండి’... రాజుల రగడ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెలుగుదేశంలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుపాకాన పడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేశ్, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు చంద్రబాబు కొమ్ముకాస్తుండటంతో వారిద్దరి సిగపట్లు పత్రికలకెక్కుతున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనుచరుడుగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు 2019లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయితే అనుకోకుండా రాజకీయ సమీకరణాలు మారడంతో శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా, రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థి ఓడిపోగా, ఆయన శిష్యుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ రగడకు బీజం పడింది. కార్యాలయం సాక్షిగా వర్గపోరు భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు ఇటీవల మరింత తీవ్రమైంది. తనకు ప్రాధాన్యమివ్వకుండా... కార్యక్రమాలకు పిలవకుండా... తనను అసలు పట్టించుకోకుండా మంతెన అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపేశారు. అదిగో అప్పటినుంచే విభేదాలు బహిర్గతమయ్యాయి. తాజాగా చంద్రబాబు తనకు టికెట్ హామీ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... మంతెన రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్టు క్యాడర్‌కు చెప్పుకుంటూ ఇటీవలే నియోజకవర్గమంతా కంచాలు పంపిణీ చేశారు. విమర్శల వివాదం గత వారం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కొన్ని మీడియా ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పించారు. 2019లో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు వద్దకు తీసుకువెళితే 10వ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ ఏంటి.. అని ఎద్దేవా చేశారనీ, అందువల్ల తాను ఎంపీగా పోటీచేసి, అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నాననీ ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోయింది. పార్టీ మండల అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి వేటుకూరి నియోజకవర్గానికి ఏం చేశాడు.. బీసీలకు ఏం చేశాడు.. అసలు ఆయన అభ్యర్థే కాదు.. అసలు టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదని ఎదురు దాడి చేయడంతో రగడ తారస్థాయికి చేరింది. టీడీపీ టికెట్ నాకే... ఆకివీడు : ఉండి టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం తన సేవా సంస్థ తలుపులు తెరిచి నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తానని విలేకర్లకు వివరించారు. తనకు చెందిన శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు శుక్రవారం శాంతి హోమం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సహకారంతో పోటీ చేయడం తథ్యమని ఘంటాపథంగా చెప్పారు. -
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోడి పందాలు
ఉండి : మండలంలో బుధవారం ఎక్కడ చూసినా పందెంరాయుళ్ల హడావిడే కనిపించింది. కోడిపుంజులను చేతపట్టుకుని వాహనాలపై కోడి పందాల బరులకు వచ్చారు. మండలంలోని మహదేవపట్నం, ఉండి, కోలమూరు, యండగండిలో కోడిపందాలు, గుండాట, కోతాట వంటి జూదాలు యథేచ్ఛగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వేటూకూరి వెంకటశివరామరాజు మహదేవపట్నంలో దగ్గరుండి కోడిపందాలు నిర్వహించారు. యండగండిలో సినీనటుడు శ్రవణ్ సినీనటుడు(ప్రతి నాయకుడి పాత్రధారి) శ్రవణ్ కోడిపందాలకు హాజరయ్యారు. యండగండికి చెందిన అతని స్నేహితుడు ఇందుకూరి అప్పలనరసింహరాజు ఆహ్వానం మేరకు వచ్చారు. తులసి, సింహ, లెజెండ్, ఏక్‌నిరంజన్ తదితర చిత్రాలతో శ్రవణ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయనతో కరచాలనానికి స్థానికులు పోటీపడ్డారు. శ్రవణ్ మాట్లాడుతూ పల్లె వాతావరణం చాలా అద్భుతంగా వుందన్నారు. షూటింగులతో బిజీగా ఉండే తాను సంక్రాంతి సందర్భంగా పల్లె వాతావరణం ఆస్వాదిస్తున్నానన్నారు. సంక్రాంతి పండగను ఈప్రాంతంలోనే చేసుకోవాలనిపిస్తుందని చెప్పారు. ఇక్కడకు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోందని పేర్కొన్నారు. శ్రవణ్‌తోపాటు సినీపరిశ్రమకు చెందిన పాల్, క్రాంతి, శశి ఈ సంబరాలలో పాల్గొన్నారు. -
మునిగిపోతున్న ఎమ్మెల్యేను రక్షించిన గన్‌మన్
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: నదిలో మునిగిపోతున్న ఎమ్మెల్యేను గన్‌మన్ రక్షించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు కుటుంబసభ్యులతో కలసి వేదాద్రిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామి సన్నిధికి వచ్చారు. కృష్ణానదిలో ఉన్న సాలగ్రహ నరసింహాస్వామి (నామాలు) వద్దకు నీటిలో ఈదుకుంటూ వెళ్లారు. స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న గన్‌మన్ గమనించి నదిలోకి దూకి ఎమ్మెల్యేను రక్షించాడు.