సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెలుగుదేశంలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుపాకాన పడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేశ్, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు చంద్రబాబు కొమ్ముకాస్తుండటంతో వారిద్దరి సిగపట్లు పత్రికలకెక్కుతున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనుచరుడుగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు 2019లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయితే అనుకోకుండా రాజకీయ సమీకరణాలు మారడంతో శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా, రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థి ఓడిపోగా, ఆయన శిష్యుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ రగడకు బీజం పడింది.
కార్యాలయం సాక్షిగా వర్గపోరు
భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు ఇటీవల మరింత తీవ్రమైంది. తనకు ప్రాధాన్యమివ్వకుండా... కార్యక్రమాలకు పిలవకుండా... తనను అసలు పట్టించుకోకుండా మంతెన అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపేశారు. అదిగో అప్పటినుంచే విభేదాలు బహిర్గతమయ్యాయి. తాజాగా చంద్రబాబు తనకు టికెట్ హామీ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... మంతెన రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్టు క్యాడర్‌కు చెప్పుకుంటూ ఇటీవలే నియోజకవర్గమంతా కంచాలు పంపిణీ చేశారు.
విమర్శల వివాదం
గత వారం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కొన్ని మీడియా ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పించారు. 2019లో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు వద్దకు తీసుకువెళితే 10వ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ ఏంటి.. అని ఎద్దేవా చేశారనీ, అందువల్ల తాను ఎంపీగా పోటీచేసి, అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నాననీ ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోయింది. పార్టీ మండల అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి వేటుకూరి నియోజకవర్గానికి ఏం చేశాడు.. బీసీలకు ఏం చేశాడు.. అసలు ఆయన అభ్యర్థే కాదు.. అసలు టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదని ఎదురు దాడి చేయడంతో రగడ
తారస్థాయికి చేరింది.
టీడీపీ టికెట్ నాకే...
ఆకివీడు : ఉండి టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం తన సేవా సంస్థ తలుపులు తెరిచి నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తానని విలేకర్లకు వివరించారు. తనకు చెందిన శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు శుక్రవారం శాంతి హోమం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సహకారంతో పోటీ చేయడం తథ్యమని ఘంటాపథంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment