Vicky Goswami
-
నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి
ముంబై: 1990వ దశకంలో కరణ్ అర్జున్, ఆషికీ అవారా వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన భామ మమతా కులకర్ణి.. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఈమె ముంబైలో ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న మమతా కులకుర్ణి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు తెలిపింది. ఒకప్పుడు అందాల శృంగార తారగా వెలుగొందిన తాను ఇప్పుడు యోగినిగా మారానని, తన ఆత్మకథను చదివితేనే.. తన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరిస్తానని ఆమె తెలిపింది. నైరోబీలో ఉన్న ఆమె ఈమెయిల్ ద్వారా తన ఆత్మకథను పంపి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. బాలీవుడ్లో టాప్-2 హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్‌గిరి మహారాజ్ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు ఆమె తెలిపింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మమతా కులకర్ణి డ్రగ్స్ మాఫియా నేరగాడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడి.. అర్ధాంతరంగా దుబాయ్ వెళ్లిపోయింది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది. ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని, పోలీసులే కావాలని తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది. తన ఆత్మకథ చదివితే తానేమిటో అందరికీ అర్థమవుతుందని, తనపై కేసులు కూడా తేలిపోతాయని ఆమె పేర్కొంది. -
డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్!
థానే: నేరచరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒకేసారి రూ.2 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత కేసులో సినీ నటి మమతా కులకర్ణి మెడచుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ముంబై శివారు పట్టణం థానేలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ మూలాలు ఆఫ్రికా దేశం కెన్యాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు(చదవండి: నేర చరిత్రలోనే ఇది రికార్డ్).. అక్కడ మమతతోపాటు ఆమె భర్త, అంతర్జాతీయ స్మగ్లర్ విక్కీ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు తనకు ఎలాటి సంబంధంలేదని మమత వాదిస్తోంది. విక్కీ కూడా మమత తన భార్య కాదని చెప్పుకొచ్చాడు. కానీ మమత కూడా నిందితురాలేనని, మొత్తం వ్యవమారం ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు అంటున్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: నటి మమతాకులకర్ణి అరెస్టు!) థానేలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తు పురోగతిని మీడియాకు వెల్లడించారు. అరెస్టు సమయంలో మమతా కులకర్ణి చెప్పుకున్నట్లు ఆమె అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉందని, ఆమేరకు దర్యాప్తులో ఆధారాలు లభించాయని, అందుకే నిందితుల జాబితాలో ఆమె పేరును కూడా చేర్చుతున్నట్లు పరంవీర్ చెప్పారు. మమతపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ ను కోరతామని, అలాగే మమత, గోస్వామి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని పరంవీర్ సింగ్ ఉద్ఘాటించారు. (చదవండి: ఆ హీరోయిన్ నా భార్య కాదు!) థానేలో పట్టుబడ్డ డ్రగ్స్ ను కెన్యా నుంచి సరఫరాచేశారన్న ఆరోపణలపై మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గో స్వామిని గత నెల కెన్యా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కలకలం డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా కులకర్ణి అరెస్టు బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. మాదక ద్రవ్యాల సరఫరాలో మమత.. బాలీవుడ్ లోని కొందరు వ్యక్తుల సహాయం తీసుకున్నారని, ఆ సెలబ్రిటీలను ఇప్పటికే విచారించామని థానే పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ తెలిపారు. అయితే సదరు సెలబ్రిటీల పేర్లు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. (చదవండి: హీరోయిన్ పై పోలీసు నిఘా) -
ఆ హీరోయిన్ నా భార్య కాదు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెను తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని ఆయన చెప్పాడు. తొలిసారి టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. 'మమతా కులకర్ణి నా శ్రేయోభిలాషి మాత్రమే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అంతేకానీ ఆమె నా భార్య కాదు. ఆమెను నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు' అని విక్కీ గోస్వామి చెప్పాడు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అధినేతగా గుర్తింపు పొందిన విక్కీ గోస్వామి ప్రస్తుతం కెన్యాలోని మొంబాసాలో ఉంటున్నాడు. అక్కడి నుంచి తనను భారత్‌కు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నదని, కాబట్టి తాను భారత్‌కు వచ్చే అవకాశమే లేదని అతను తేల్చిచెప్పాడు. తనను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. ఇటీవల థానెలో పట్టుబడిన రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తన గ్యాంగ్‌కే చెందినవని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. కాగా, విక్కీ గోస్వామి భార్యగా భావిస్తున్న మమతా కులకర్ణి గతంలో ఆయనకు మద్దతుగా మీడియాతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్!
థానే: బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మమతా కులకుర్ణిపై 'డ్రగ్స్' మేఘాలు కమ్ముకున్నాయి. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ లో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో అతడు తలపండిపోయాడు. 1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విక్కి 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబికి మకాం మార్చాడు. అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అమెరికా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అమెరికా సమాచారంతో థానే పోలీసులు కూడా అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. మమత పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని థానే పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు. 1990లో అగ్రతారగా వెలుగొందిన మమతా కులకుర్ణి టాప్ హీరోల సరసన నటించింది. తనపై ఇంటర్ పోల్ నోటీసు ఉండడంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత తన భార్యకు విక్కి అప్పగించాడని థానే పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలోనూ ఆమె డగ్స్ నెట్ వర్క్ నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు మమత పేరు విక్కి వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హవాలా మార్గంలోనూ వీరు లావాదేవీల జరుపుతున్నట్టు భావిస్తున్నారు. అంతకుముందు మమతా కులకుర్ణి పేరు బయటికి రాలేదు. విక్కి గోస్వామికి, ముంబైలోని డ్రగ్స్ స్మగ్లర్లకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న పునిత్ శ్రింగి అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడు తెలిపిన వివరాలు ఆధారంగా మమత పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు.