డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్!
థానే: నేరచరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒకేసారి రూ.2 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత కేసులో సినీ నటి మమతా కులకర్ణి మెడచుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ముంబై శివారు పట్టణం థానేలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ మూలాలు ఆఫ్రికా దేశం కెన్యాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు(చదవండి: నేర చరిత్రలోనే ఇది రికార్డ్).. అక్కడ మమతతోపాటు ఆమె భర్త, అంతర్జాతీయ స్మగ్లర్ విక్కీ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు తనకు ఎలాటి సంబంధంలేదని మమత వాదిస్తోంది. విక్కీ కూడా మమత తన భార్య కాదని చెప్పుకొచ్చాడు. కానీ మమత కూడా నిందితురాలేనని, మొత్తం వ్యవమారం ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు అంటున్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: నటి మమతాకులకర్ణి అరెస్టు!)
థానేలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తు పురోగతిని మీడియాకు వెల్లడించారు. అరెస్టు సమయంలో మమతా కులకర్ణి చెప్పుకున్నట్లు ఆమె అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉందని, ఆమేరకు దర్యాప్తులో ఆధారాలు లభించాయని, అందుకే నిందితుల జాబితాలో ఆమె పేరును కూడా చేర్చుతున్నట్లు పరంవీర్ చెప్పారు. మమతపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ ను కోరతామని, అలాగే మమత, గోస్వామి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని పరంవీర్ సింగ్ ఉద్ఘాటించారు. (చదవండి: ఆ హీరోయిన్ నా భార్య కాదు!) థానేలో పట్టుబడ్డ డ్రగ్స్ ను కెన్యా నుంచి సరఫరాచేశారన్న ఆరోపణలపై మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గో స్వామిని గత నెల కెన్యా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో కలకలం
డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా కులకర్ణి అరెస్టు బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. మాదక ద్రవ్యాల సరఫరాలో మమత.. బాలీవుడ్ లోని కొందరు వ్యక్తుల సహాయం తీసుకున్నారని, ఆ సెలబ్రిటీలను ఇప్పటికే విచారించామని థానే పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ తెలిపారు. అయితే సదరు సెలబ్రిటీల పేర్లు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. (చదవండి: హీరోయిన్ పై పోలీసు నిఘా)