ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు
అనంతపురం : విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ సుమారు 21 ఏళ్ల కిందట అదృశ్యమైన దామోదర్ ఆంజనేయులు (2019)కు సంబంధించిన కేసు విషయమై ఎస్ఐ, ఉరవకొండ సీఐకు సమాచార హక్కు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 38/1995 కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో మార్చి 1న కమిషనర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
ఈ కేసు పురోగతిపై దామోదర్ బంధువు ఎస్.అనిల్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద స్టేషన్ హౌస్ ఆఫీసర్, విడపనకల్లుకు దరఖాస్తు చేశారు. అయితే అధికారులు అరకొర సమాచారం ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని అనిల్‌కుమార్ అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసినా అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సమాచార కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 1న హాజరుకావాలంటూ సమాచార కమిషనర్ నుంచి నోటీసులు ఇచ్చారు. ఇదిలాఉండగా ఇటీవల ఎస్పీ విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆ సమయంలో దామోదర్ ఆంజనేయులు కేసు విషయమై ఆరా తీసినట్లు తెలిసింది. విడపనకల్లు ఎస్ఐ వచ్చి తనను వివరాలు అడిగారని అనిల్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.