video-conferencing
-
నోట్ల రద్దుతో ఆర్థిక మందగమనం
పేదల కష్టాలపై తక్షణం దృష్టిపెట్టాలన్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో తాత్కాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ఇక్కట్ల నేపథ్యంలో పేదలు ఎక్కువ సమయం వేచి ఉండలేరని, వారికి తక్షణ సాయం అందాల్సిన అవసరముందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రణబ్ ప్రసంగించారు. ‘నల్లధనం, అవినీతిపై పోరాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలు ఇబ్బంది పడకుండా అదనపు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. దీర్ఘకాలంలో ఆశించిన అభివృద్ధి కోసం ఇది తప్పనిసరి. అప్పుడే ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలన కోసం సాగుతున్న ప్రయాణంలో వారు క్రియాశీల భాగస్వాములు కాగలరు’ అని చెప్పారు. పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల్ని అభినందిస్తున్నానని, అయితే ఫలితాలు దక్కేందుకు పేదలు ఇంకెంత కాలం వేచి ఉండాలో స్పష్టం గా చేప్పలేనన్నారు. దీర్ఘకాల లాభాల కోసం తాత్కాలిక ఇబ్బందులు తప్పవన్నారు. ఇటీవల పేదల కోసం ప్రధాని ప్రకటించిన ప్యాకే జీ వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు. అనేక యూనివర్సిటీలకు చాన్సలర్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు... ఉన్నత విద్య ప్రమాణాల మెరుగుదల కోసం విద్యా రంగ నిపుణులతో కలిసి పనిచేయాలన్నారు. -
12 నాటికి 22 వేల మంది వివరాలు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆదేశం ఒంగోలు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22 వేల మంది వివరాలు ఈ నెల 12వ తేదీ నాటికి సేకరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో గురువారం స్థానిక సీపీఓ వీడియో కాన్ఫరెన్స హాలు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చిన్న పిల్లల వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో కొంతమంది వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కానట్లు తెలిసిందని చెప్పారు. ఆధార్ నంబర్లు లేని కారణంగా మరి కొంతమంది వివరాలు నమోదు కాలేదన్నారు. ఆధార్ కార్డులు లేని వారి కోసం గ్రామాల వారీగా మేళాలు నిర్వహించి యుద్ధప్రాతిపదికన వాటిని అందించాలని ఆదేశించారు. ఆధార్ నంబర్లు పొందిన వెంటనే వారి వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా చనిపోయినవారి వివరాలు సర్వే నుంచి తొలగించాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డుల వారీగా స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించిన జాబితాలను క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వందశాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భక్తవత్సలరెడ్డి, స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా నోడల్ అధికారి ఉదయభాస్కర్, ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు. -
‘ఖమ్మం’ స్ఫూర్తితో ముందుకు సాగాలి
• ఏడాదిలోనే భక్తరామదాసు • ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు • కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సలో మంత్రి హరీష్‌రావు ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తున్నారని, అదే స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్లతో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత కీలకమని, దీనికి కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యం కల్పించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చేపట్టనున్న 3వ విడత చెరువుల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలన్నారు. డిసెంబర్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడతలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉంటే సమర్థవంతంగా పనిచేసే రిటైర్డ సర్వేయర్లను నియమించుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్లు, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ 3వ విడత కింద జిల్లాలో 215 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌లు
కేంద్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన చట్టాలు చేసేందుకు దగ్గరి దారిగా చూడొద్దని హితవు న్యూఢిల్లీ: మోదీ సర్కారు కుప్పలుతెప్పలుగా ఆర్డినెన్స్‌లు తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కొన్ని అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్లమెంట్ ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించిందని, దీన్ని చట్టాలు చేయడానికి సులువైన మార్గంగా చూడొద్దని కేంద్రానికి సూచించారు. ఆర్డినెన్స్ వెసులుబాటును సాధారణ చట్టాలకు కూడా వర్తింపచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని పార్టీలు చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. సోమవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లోని ఫ్యాకల్టీ, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్ ఆమోదంతో పనిలేకుండానే ప్రభుత్వం పలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘కొన్నిసార్లు చట్టాన్ని ఆమోదించుకోవడానికి అధికార పార్టీకి రాజ్యసభలో తగినంత మంది సభ్యులు ఉండకపోవచ్చు. అప్పుడు ఉభయ సభలను సమావేశపరిచి చట్టాన్ని ఆమోదించుకోవచ్చు. వాస్తవానికి ఇది కూడా క్లిష్టమే. 1952 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఉభయ సభలను సమావేశపరిచి నాలుగుసార్లు మాత్రమే చట్టాలు ఆమోదించారు. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి రాజ్యాంగం అనుమతించింది. సాధారణ చట్టాలు చేయడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవడం సరికాదు’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘‘ఒక అంశాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు, పూర్తిగా నిరాకరించవచ్చు. ఏదేమైనా ఆ సమస్యకు వివిధ మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. భూసేకరణతోపాటు వివిధ కీలకాంశాలపై మోదీ సర్కారు ఏకంగా ఎనిమిది ఆర్డినెన్స్‌లు తీసుకువ చ్చిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే ముందు దాని ఆవశ్యకతపై ముగ్గురు సీనియర్ కేంద్రమంత్రుల నుంచి ప్రణబ్ వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే.