‘ఖమ్మం’ స్ఫూర్తితో ముందుకు సాగాలి
• ఏడాదిలోనే భక్తరామదాసు
• ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు
• కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్‌సలో మంత్రి హరీష్‌రావు
ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తున్నారని, అదే స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్లతో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత కీలకమని, దీనికి కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యం కల్పించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చేపట్టనున్న 3వ విడత చెరువుల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలన్నారు. డిసెంబర్‌లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రెండో విడతలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉంటే సమర్థవంతంగా పనిచేసే రిటైర్‌డ సర్వేయర్లను నియమించుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్లు, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ 3వ విడత కింద జిల్లాలో 215 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.