video kanpharen
-
‘ఉపాధి’ వ్యయం రూ.176 కోట్లు
కూలీల హాజరు పంపడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం నేడు కూలీల హాజరు పంపడంపైనే వీడియో కాన్ఫరెన్స సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఉపాధిహామీ పథకం నిర్వహణలో నిధుల వ్యయం 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.176 కోట్లు దాటింది. వేతనాలు, పనుల నిర్వహణకు చెల్లింపుల ద్వారా పై మొత్తాన్ని ఖర్చు చేశారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 320 కోట్ల నిధులు ఉపాధిహామీ కింద వ్యయం చేసే లక్ష్యంతో డ్వామా అధికారులు అంచనాలు రూపొందించారు. ఫిబ్రవరి వరకు రూ.176 కోట్లు ఖర్చయ్యాయి. గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నిర్దేశించిన ఉత్తర్వుల ప్రకారం గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల హాజరును ఎప్పటికప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీం వెబ్సైట్ సర్వర్‌కు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ పని ప్రస్తుతం సక్రమంగా జరగడం లేదు. 50 శాతం హాజరే అప్లోడ్ ఉపాధి పనులకు హాజరైన కూలీల సంఖ్య వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్లు రోజూ తమ మొబైల్ఫోన్ల నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ సర్వర్‌కు పంపాలి. ఈ ఆదేశాలను కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే పాటిస్తున్నారు. జిల్లాలో రోజుకు సరాసరి 59 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. అయితే 30 వేల మంది హాజరు మాత్రమే వస్తోంది. దీనిపై డ్వామా అధికారులు ఎప్పటికప్పుడు మండల అధికారులను అప్రమత్తం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ జిల్లాలోని డ్వామా ఉన్నతాధికారులు, ఎంపీడీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స నిర్వహించనున్నారు. అనంతరం ఉపాధికూలీల హాజరు ఏరోజుకారోజు ఆన్లైన్ సర్వర్‌కు పంపకపోతే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటారు. టెక్నికల్ అసిస్టెంట్ల ఎంపిక జిల్లాలో వివిధ మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్లుగా 20 మందిని నియమించేందుకు డ్వామా కార్యాలయంలో సోమవారం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. మొత్తం 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు, మార్కుల శాతం ఆధారంగా 70 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వచ్చారు. సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమోలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు డ్వామా పీడీ చంద్రమౌళి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హైదరాబాద్‌లో జరిగేదన్నారు. అయితే నిరుద్యోగులకు ఖర్చు తగ్గించేందుకు తాము చిత్తూరులోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న వేసవిలో ఉద్యానవనాలు, మామిడి కొమ్మల కత్తిరింపు తదితర పనులు చేయనున్న ట్లు పేర్కొన్నారు. -
16 నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలి
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: అన్ని జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన శనివారం హైదరాబాద్ నుంచి ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ఓటు హక్కు కోసం నూతనంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వీటిలో ఎన్నింటిపై విచారించారు అనే వివరాలను భన్వర్‌లాల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి సంబంధిత బూత్‌లెవల్ అధికారులు విచారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 10వ తేదీలోపు ముగించి జాబి తాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. దరఖాస్తుల విచారణకు సంబంధించి రాష్ట్ర సగటు 10 శాతం ఉంటే, చిత్తూరు జిల్లాలో 28 శాతం ఉం దన్నారు. జిల్లాలో ఈవీఎంలు, వాటి భద్రతపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,63,198 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటిలో 73,776 దరఖాస్తులను విచారించి పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిపై జనవరి 10వ తేదీ లోపు విచారణ జరుపుతామని పేర్కొన్నా రు. ఎన్నికల సామగ్రికి సంబంధించి జిల్లాలోని 5,358 బ్యాలెట్ యూనిట్లు, 4,194 కంట్రోల్ యూనిట్లను పశ్చిమబెంగాల్‌కు పంపినట్లు వివరించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచుకునేందుకు అవసరమైన గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయని, పనులను త్వరలోనే పూర్తి చేస్తామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బసంత్‌కుమార్, డీఆర్వో శేషయ్య, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌కుమార్ గుప్తా, తిరుపతి, చిత్తూరు ఆర్డీవోలు రామచంద్రారెడ్డి, పెంచలకిషోర్, జెడ్పీ సీఈవో నాగేశ్వరరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.