వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఎంజీఎం (వరంగల్): వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భీమారంలోని శ్రీ విద్వాన్ జూనియర్ కళాశాలలో మరిపెడ మండలం ఏడుచర్ల గ్రామ సమీపంలోని గురుపతండాకు చెందిన బానోతు భాస్కర్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థి సినిమా చూసిన అనంతరం రాత్రి పది గంటలకు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ సమయంలో భాస్కర్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. ‘నా పేరు భాస్కర్. శ్రీ విద్వాన్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదవుతున్నాను. నాకు తండ్రి లేడు. అమ్మతో పాటు అక్కబావ ఉన్నారు. ఇందులో వారి సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నేను క ళాశాల నుంచి రాత్రి వచ్చాను. విద్వాన్ క ళాశాల వేస్ట్ కళాశాల, దానిని క్లోజ్ చేయండి. నేను మందు తాగి చనిపోతున్నాను. ఇందులో సినిమా థియేటర్ వాళ్ళ తప్పు ఏమీ లేదు. వారిని అరెస్టు చేయవద్దు’. అని లేఖలో పేర్కొన్నాడు. కళాశాలలో ఫీజు కోసం యాజమాన్యం ప్రవర్తించిన తీరు వల్లనే భాస్కర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నాకి ఓడిగట్టినట్లు బంధు మిత్రులు ఆరోపిస్తున్నారు. కాగా, భాస్కర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు చికిత్స చేస్తున్నారు.