Vidya Sagar Reddy
-
ఐటీ సలహాదారులను నియమించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా నియమించగా.. కె. రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీదారులుగా నియమించారు. ఈ మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ సీపీ నేత దుర్మరణం
తవణంపల్లి : చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందగా అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయవేలూరు సీఎమ్సీ ఆసుపత్రికి తరలించారు. కాణిపాకంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి , ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే మరణించగా, మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు
► సర్కార్‌పై ‘స్త్రీనిధి’ మహిళల మండిపాటు ► ఎజెండాను చదవకుండానే ఆమోదించమంటే ఎలాగని ఎండీపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మహిళా సంఘాల సంక్షేమంపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పలువురు మహిళా సమాఖ్యల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. ఎజెండా అంశాలను ముందుగా తెలపకుండానే, సమావేశంలోనే ఇచ్చి హడావుడిగా ఆమోదం తెలపాలని స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. వేదికపైన అధ్యక్షురాలు చదువుతున్న అంశాలకు, తమ చేతికి అందించిన ఎజెండా కాపీలోని అంశాలకు పొంతన లేదని మహిళలు దుయ్యబట్టారు. రూ.37.25 కోట్ల ఆదాయం వచ్చిందంటూ ప్రభుత్వానికి రూ.3.48 కోట్ల డివిడెంట్ ఇచ్చిన ఎం.డి. విద్యాసాగర్‌రెడ్డి, రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టిన తమ జిల్లా సమాఖ్యకు ఏడాదిగా వడ్డీని ఎందుకు చెల్లించలేదని నిజామాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నిలదీశారు. రెండేళ్లుగా ప్రభుత్వం తన వాటాధనం ఇవ్వకుంటే కిక్కురుమనని అధికారులు, గ్రామ, మండల సమాఖ్యలపై వాటాధనం పేరిట అదనపు భారం మోపడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలను చెల్లించేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం, గ్రామ సమాఖ్యల అనుమతి లేకుండానే సహాయకులకు వేతనం ఎలా పెంచిందని ప్రశ్నించారు. ఉపాధిహామీ పనులకు వెళ్లండి: జూపల్లి మరోమారు వాటాధనం చెల్లించడం తమకు అదనపు భారమంటున్న గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, కూలీ పనులకు పోతే కుటుంబానికి రూ.15 వేల నుంచి 19 వేల దాకా ఆదాయం వస్తుందని జూపల్లి అన్నారు. త్వరలోనే వడ్డీలను చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశం ఆమోదించిన అంశాలివే l2017–18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.225 కోట్ల రుణాలు lపాడి గేదెల కొనుగోలు కోసం రూ.100 కోట్లు రుణంగా అందించాలని నిర్ణయం lసభ్యుల పిల్లలకు సైకిళ్లు, సభ్యులకు స్మార్ట్ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు రుణాలు lఎస్‌హెచ్‌జీ మహిళల కోసం కొత్త బీమా పథకానికి రూపకల్పన, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు అందేలా పథకం lగతేడాది కన్నా ఒక శాతం అధికంగా 8 శాతం డివిడెండ్‌ను చెల్లించాలని తీర్మానం lరూ.1,000 రుణానికి రూ.4ల సురక్ష ప్రీమియంను 2.50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయం వార్షిక రుణ లక్ష్యం రూ.1,810 కోట్లు 2017–18 వార్షిక ఏడాది బడ్జెట్‌ను రూ.2,623 కోట్లుగా ప్రతిపాదించామని, ఇందులో వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.1,810 కోట్లుగా నిర్ణయించినట్లు విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. 2016–17 సంవత్సరంలో రుణలక్ష్యాన్ని ఇంతవరకు చేరుకోలేకపోయినా వార్షిక రుణలక్ష్యాన్ని 2 9 శాతం పెంచడం పట్ల మహిళా సమాఖ్యల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఆకుపచ్చని భవిష్య నిధి!
పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత ప్రయోజనం! అయితే, ఆరుగాలం చెమటోడ్చినా కాలం కలసి రాకనో, చేతికొచ్చిన దిగుబడికి ధర గిట్టుబాటు కాకనో.. రైతన్న పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగానే మిగిలింది. కొద్ది నెలల్లో ఆదాయాన్నిచ్చే ఆహార/వాణిజ్య పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడటమే అత్యధిక అన్నదాతల దుస్థితికి ఒకానొక ముఖ్యకారణం! ఈ వాస్తవాన్ని గ్రహించిన కొందరు రైతులు.. ఏటేటా కొన్నేళ్లపాటు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి సారిస్తూ.. కొంత మేరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు. అయితే.. నాటిన పది, పదిహేనేళ్ల తర్వాత తీసేసే పండ్ల తోటలతో పాటుగా.. ఇరవై, పాతికేళ్లకు ఒకేసారి కోతకొచ్చే ఖరీదైన కలప చెట్లను సాగు చేస్తున్న రైతన్నలు బహు కొద్ది మంది మాత్రమే. దూరదృష్టితో వెలుగుబాటన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న అటువంటి అరుదైన అభ్యుదయ రైతు చిలుక విద్యాసాగర్‌రెడ్డి! ఏడాదికో కాపునిచ్చే బత్తాయి తోటలో అంతరపంటలుగా భవిష్యత్తులో సిరులు కురిపించే ఎర్రచందనం, శ్రీగంధం సాగు చేస్తూ రైతాంగానికి వెలుగుబాట చూపుతున్నారాయన.. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన విద్యాసాగర్ రెడ్డికి నల్లగొండకు సమీపంలో 8 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చడానికి కొత్తగా ఏదైనా చేద్దామన్న తపన కలిగిన రైతు కావడంతో అనేక ప్రయోగాలు చేస్తుంటారాయన. పదేళ్ల క్రితం 7 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటారు. బత్తాయి తోటలో మొదటి మూడేళ్లూ అంతరపంటగా పుచ్చను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. 17,18 కిలోల బరువైన పుచ్చ కాయలు ఆయనకు ఉత్తమ రైతు అవార్డులు తెచ్చిపెట్టాయి. రైతులు కూడా కూరగాయలు మార్కెట్లో కొనుక్కోవడం సమంజసం కాదని ఆయన అంటారు. ఏ పంటలు సాగు చేసే రైతైనా తన పొలంలో ప్రధాన పంటలతోపాటే కుటుంబానికి సరిపడా కూరగాయలు, పండ్లు విధిగా పండించుకోవాలన్నది విద్యాసాగర్‌రెడ్డి అభిమతం. ఇందుకు అనుగుణంగానే తన బత్తాయి తోటలో మామిడి, సపోట, అరటి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలతోపాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటల సాగు విస్తీర్ణం అప్పట్లో మూడున్నర లక్షల ఎకరాలకు చేరడంతో మార్కెటింగ్ సమస్యలు తలెత్తాయి. ప్రోసెసింగ్ ప్లాంట్లు, ప్రత్యేక బత్తాయి మార్కెట్ వంటి మౌలిక సదుపాయాలు మృగ్యం కావడంతో.. కోటి ఆశలతో పండించిన పంటను వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతు చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతుకు ఏటా ఫలసాయాన్నిచ్చే పంటలతోపాటే పెరుగుతూ.. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించే పంటలేమైనా ఉన్నాయా? అన్న అంశంపై దూరదృష్టితో అన్వేషించారు విద్యాసాగర్‌రెడ్డి. ఆ క్రమంలోనే ఎర్రచందనం, శ్రీగంధంపై ఆయన దృష్టి పడింది. దాదాపు రెండు దశాబ్దాలు పెంచిన తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో ఆదాయాన్నిచ్చే పంటలు కావడంతో వృద్ధాప్యంలో తనకు ఈ పంటలు ఆర్థిక భద్రతను ఇవ్వగలుగుతాయని ఆయన తలపోశారు. 2007లో బెంగళూరులో నర్సరీ నుంచి తెచ్చిన వెయ్యి ఎర్రచందనం మొక్కలు, మరో వెయ్యి శ్రీగంధం మొక్కలను బత్తాయి చెట్ల మధ్య నాటారు. 2010లో మరో ఎకరంలో 700 టిష్యూ కల్చర్ టేకు మొక్కలు నాటారు. ప్రస్తుతం పదేళ్ల వయసున్న విద్యాసాగర్‌రెడ్డి బత్తాయి తోటలో ఏడేళ్ల వయసున్న ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. ఎర్రచందనం, శ్రీగంధం సాగు ఇలా.. ఎర్రచందనం నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. జూన్-డిసెంబర్ మధ్యలో మొక్కలు నాటుకోవచ్చు. 10 అడుగుల దూరంలో ఎకరానికి 450 మొక్కలు నాటొచ్చు. మొదట్లో ఒకటి, రెండేళ్లు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వారానికోసారి నీరిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి ఎరువులు, మందులు, నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 60 అడుగుల వరకు ఎత్తు, 3-5 అడుగుల వరకు చుట్టుకొలతతో పెరుగుతుంది. చెట్టుకు 100-500 కిలోల చేవ కలిగిన కలప దిగుబడి వస్తుంది. మూడేళ్ల వరకు కొమ్మలు కత్తిరించకూడదు. 4వ ఏడాది నుంచి పూత, పిందె వస్తాయి. 20-25 ఏళ్ల పంట కాబట్టి పట్టా భూముల్లోనే నాటాలి. నీరు నిలబడే భూముల్లో, చౌడు భూములు పనికిరావు. పశువులు తినవు కాబట్టి గట్ల మీదా పెంచొచ్చు. విత్తనం ద్వారా మొక్కలు పెంచవచ్చు. చెట్టుకు 100-500 కిలోల చేవ కలప వస్తుంది. శ్రీగంధం ఒంటరిగా పెరగలేదు. పక్కన చెట్టు వేరు ఆధారంగా శ్రీగంధం మొక్క వేరు పోషకాలు గ్రహిస్తుంది. విద్యాసాగర్ రెడ్డి శ్రీగంధం పక్కన తొలి ఏడాది కంది, గులాబీ సాగు చేశారు. బత్తాయి తోట పెరిగిన తర్వాత ఆ కంది, గులాబీ వేయడం లేదు. తుమ్మ, వేప, నిమ్మ తోటల్లోనూ శ్రీగంధం వేసుకోవచ్చు. నీరు నిలబడని నేలల్లో బాగా వస్తుంది. దీని వేరు, బెరడు కూడా సుగంధ ద్రవ్యాల తయారీకి పనికొస్తాయి. 20-25 ఏళ్లలో చెట్టు 30 అడుగుల ఎత్తున 2.5-3 అడుగుల చుట్టుకొలతతో పెరుగుతుంది. 3-4 ఏళ్లలో పూత, పిందె వస్తాయి. దీనికి దేశీయంగా మంచి గిరాకీ ఉంది. ఎర్రచందనం మాదిరిగా చట్టపరమైన ఆంక్షలేమీ లేవు. అయితే, ఈ రెండు పంటల సాగునూ రాష్ర్ట ఔషధ మొక్కల బోర్డులు ప్రోత్సహిస్తున్నాయి. ఎర్రచందనం అనగానే.. కేసులే గుర్తుకొస్తుంటాయి. కానీ, ఎర్రచందనం సాగు చేయడానికి చట్టపరమైన అభ్యంతరాలేమీ లేవు. చెట్లు నరకడానికి మాత్రం అటవీ శాఖ అనుమతి పొందాలి. అంతరించిపోతున్న అత్యంత విలువైన కలప జాతి కావడం వల్ల ఎర్రచందనం దుంగల ఎగుమతిపై ప్రస్తుతం ఆంక్షలున్నాయి. అయితే, ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం లేదు. అవరోధాలు తొలగకపోతాయా అన్న ఆశతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు ఎర్రచందనం సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కేవలం సీజనల్ పంటలపైనే ఆశలన్నీ పెట్టుకొని సతమతమయ్యే రైతులు.. భవిష్యత్తులో ఆర్థిక భద్రతనిచ్చే ఈ పంటలను కొద్ది విస్తీర్ణంలోనైనాసాగు చేయడం నిస్సందేహంగా తెలివైన పనే. మారుమూల పొలాల్లోకన్నా నివాసాలకు దగ్గర్లోని పట్టా భూముల్లో సాగు చేయడం మేలు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్ ఒకటి కాకపోయినా మరొకటి ఆదుకుంటుంది! ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు నాటిన మొదట్లో అందరూ నవ్వారు. ఇప్పుడు ఏపుగా పెరుగుతున్న చెట్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక పంటకు కాకపోయినా మరో పంటకైనా మంచి ధర పలుకుతుందనేది నా ఆశ. అందుకే పొలం మొత్తం ఒకటే కాకుండా ఎర్రచందనం, శ్రీగంధం, టేకు మొక్కలు నాటా. మరో 10-12 ఏళ్లకు అదృష్టం బాగుంటే కనీసం రూ.25 కోట్ల ఆదాయం వస్తుంది. పరిస్థితి అనుకూలంగా లేక వంట చెరకుగా అమ్మినా ఖాయంగా రూ. 2 కోట్లొస్తాయి. ఈ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స అండ్ టెక్నాలజీ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు తెప్పించి, మొక్కలు ఉచితంగా రైతులకివ్వాలి. భూమి తనఖా పెట్టుకొని రుణాలు, సబ్సిడీపై డ్రిప్ ఇవ్వాలి. - చిలుక విద్యాసాగర్‌రెడ్డి (94908 49474), ఎర్రచందనం, శ్రీగంధం , టేకు సాగుదారుడు, నల్గొండ -
స్త్రీ నిధి జిల్లాలో భేష్
సాక్షి, కాకినాడ: జిల్లాలో స్త్రీ నిధి పథకాన్ని సక్రమంగా అమలు చేసినపుడే మంచి ఫలితాలు వస్తాయని, తరచు అధికారులు సమీక్షలు చేస్తూ ఈ పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని స్త్రీ నిధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్ రెడ్డి పేర్కొన్నారు. విధాన గౌతమి హాలులో స్త్రీనిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సారథ్యంలో శుక్రవారం జరి గిన వర్క్ షాప్‌లో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పథకం తీరుతెన్నులను ఆయన వివరించారు. ఈ పథకం జిల్లాలో బాగా నడుస్తోందని, అయితే 86 శాతం రికవరీ ఉందని, దీన్ని మరింత పెంచాలన్నారు. ఇరవైనాలుగు మండలాల్లో మాత్రమే షేర్ క్యాపిటల్ కట్టారని, మిగిలిన మండలాలు తక్కువ షేర్ క్యాపిటల్ చెల్లించారన్నారు. డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు మాట్లాడుతూ ఈ నెలాఖరుకు అన్ని మండలాలు రూ.10 లక్షలు షేర్ క్యాపిటల్ కట్టేలా చొరవ తీసుకుంటామన్నారు. డీజీఎం ఎస్.శ్రీనివాస్, ఏరియా కో ఆర్డినేటర్లు, క్లస్టర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘స్త్రీనిధి’ రుణ పరిమితి రూ.20 లక్షలు అన్నవరం: స్త్రీ నిధి పథకం కింద గ్రామ సంఘానికి ఇస్తున్న రుణ మొత్తాన్ని ఈ జనవరి నుంచి రూ.20 లక్షలకు పెంచినట్టు ఇందిరా క్రాంతి పథం మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. గతంలో ఈ మొత్తం రూ.పది లక్షలు మాత్రమే ఉండేదన్నారు. తగినంత మూలనిధి ఉన్న, రీ పేమెంట్ సక్రమంగా ఉన్న సంఘాలకి మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుందని తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన అన్నవరంలోగ్రామ సంఘాల ప్రతి నిధుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల గ్రామ సంఘాలకు స్త్రీనిధి కింద రూ. 800 కోట్ల రుణాలిచ్చినట్టు తెలిపారు.