ఆకుపచ్చని భవిష్య నిధి! | income with plantations of fruits | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చని భవిష్య నిధి!

Published Sun, Sep 28 2014 10:59 PM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM

ఆకుపచ్చని భవిష్య నిధి! - Sakshi

ఆకుపచ్చని భవిష్య నిధి!

పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత ప్రయోజనం! అయితే, ఆరుగాలం చెమటోడ్చినా కాలం కలసి రాకనో, చేతికొచ్చిన దిగుబడికి ధర గిట్టుబాటు కాకనో.. రైతన్న పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగానే మిగిలింది. కొద్ది నెలల్లో ఆదాయాన్నిచ్చే ఆహార/వాణిజ్య పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడటమే అత్యధిక అన్నదాతల దుస్థితికి ఒకానొక ముఖ్యకారణం! ఈ వాస్తవాన్ని గ్రహించిన కొందరు రైతులు.. ఏటేటా కొన్నేళ్లపాటు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి సారిస్తూ.. కొంత మేరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు.
 
అయితే.. నాటిన పది, పదిహేనేళ్ల తర్వాత తీసేసే పండ్ల తోటలతో పాటుగా.. ఇరవై, పాతికేళ్లకు ఒకేసారి కోతకొచ్చే ఖరీదైన కలప చెట్లను సాగు చేస్తున్న రైతన్నలు బహు కొద్ది మంది మాత్రమే. దూరదృష్టితో వెలుగుబాటన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న అటువంటి అరుదైన అభ్యుదయ రైతు చిలుక విద్యాసాగర్‌రెడ్డి! ఏడాదికో కాపునిచ్చే బత్తాయి తోటలో అంతరపంటలుగా భవిష్యత్తులో సిరులు కురిపించే ఎర్రచందనం, శ్రీగంధం సాగు చేస్తూ రైతాంగానికి వెలుగుబాట చూపుతున్నారాయన..
 
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన విద్యాసాగర్ రెడ్డికి నల్లగొండకు సమీపంలో 8 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చడానికి కొత్తగా ఏదైనా చేద్దామన్న తపన కలిగిన రైతు కావడంతో అనేక ప్రయోగాలు చేస్తుంటారాయన. పదేళ్ల క్రితం 7 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటారు. బత్తాయి తోటలో మొదటి మూడేళ్లూ అంతరపంటగా పుచ్చను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. 17,18 కిలోల బరువైన పుచ్చ కాయలు ఆయనకు ఉత్తమ రైతు అవార్డులు తెచ్చిపెట్టాయి. రైతులు కూడా కూరగాయలు మార్కెట్లో కొనుక్కోవడం సమంజసం కాదని ఆయన అంటారు. ఏ పంటలు సాగు చేసే రైతైనా తన పొలంలో ప్రధాన పంటలతోపాటే కుటుంబానికి సరిపడా కూరగాయలు, పండ్లు విధిగా పండించుకోవాలన్నది విద్యాసాగర్‌రెడ్డి అభిమతం.
 
ఇందుకు అనుగుణంగానే తన బత్తాయి తోటలో మామిడి, సపోట, అరటి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలతోపాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటల సాగు విస్తీర్ణం అప్పట్లో మూడున్నర లక్షల ఎకరాలకు చేరడంతో మార్కెటింగ్ సమస్యలు తలెత్తాయి. ప్రోసెసింగ్ ప్లాంట్లు, ప్రత్యేక బత్తాయి మార్కెట్ వంటి మౌలిక సదుపాయాలు మృగ్యం కావడంతో.. కోటి ఆశలతో పండించిన పంటను వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతు చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతుకు ఏటా ఫలసాయాన్నిచ్చే పంటలతోపాటే పెరుగుతూ.. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించే పంటలేమైనా ఉన్నాయా? అన్న అంశంపై దూరదృష్టితో అన్వేషించారు విద్యాసాగర్‌రెడ్డి.
 
ఆ క్రమంలోనే ఎర్రచందనం, శ్రీగంధంపై ఆయన దృష్టి పడింది. దాదాపు రెండు దశాబ్దాలు పెంచిన తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో ఆదాయాన్నిచ్చే పంటలు కావడంతో వృద్ధాప్యంలో తనకు ఈ పంటలు ఆర్థిక భద్రతను ఇవ్వగలుగుతాయని ఆయన తలపోశారు. 2007లో బెంగళూరులో నర్సరీ నుంచి తెచ్చిన వెయ్యి ఎర్రచందనం మొక్కలు, మరో వెయ్యి శ్రీగంధం మొక్కలను బత్తాయి చెట్ల మధ్య నాటారు. 2010లో మరో ఎకరంలో 700 టిష్యూ కల్చర్ టేకు మొక్కలు నాటారు. ప్రస్తుతం పదేళ్ల వయసున్న విద్యాసాగర్‌రెడ్డి బత్తాయి తోటలో ఏడేళ్ల వయసున్న ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి.
 
ఎర్రచందనం, శ్రీగంధం సాగు ఇలా..
ఎర్రచందనం నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. జూన్-డిసెంబర్ మధ్యలో మొక్కలు నాటుకోవచ్చు. 10 అడుగుల దూరంలో ఎకరానికి 450 మొక్కలు నాటొచ్చు. మొదట్లో ఒకటి, రెండేళ్లు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వారానికోసారి నీరిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి ఎరువులు, మందులు, నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 60 అడుగుల వరకు ఎత్తు, 3-5 అడుగుల వరకు చుట్టుకొలతతో పెరుగుతుంది. చెట్టుకు 100-500 కిలోల చేవ కలిగిన కలప దిగుబడి వస్తుంది. మూడేళ్ల వరకు కొమ్మలు కత్తిరించకూడదు. 4వ ఏడాది నుంచి పూత, పిందె వస్తాయి. 20-25 ఏళ్ల పంట కాబట్టి పట్టా భూముల్లోనే నాటాలి. నీరు నిలబడే భూముల్లో, చౌడు భూములు పనికిరావు. పశువులు తినవు కాబట్టి గట్ల మీదా పెంచొచ్చు. విత్తనం ద్వారా మొక్కలు పెంచవచ్చు. చెట్టుకు 100-500 కిలోల చేవ కలప వస్తుంది.
 
శ్రీగంధం ఒంటరిగా పెరగలేదు. పక్కన చెట్టు వేరు ఆధారంగా శ్రీగంధం మొక్క వేరు పోషకాలు గ్రహిస్తుంది. విద్యాసాగర్ రెడ్డి శ్రీగంధం పక్కన తొలి ఏడాది కంది, గులాబీ సాగు చేశారు. బత్తాయి తోట పెరిగిన తర్వాత ఆ కంది, గులాబీ వేయడం లేదు. తుమ్మ, వేప, నిమ్మ తోటల్లోనూ శ్రీగంధం వేసుకోవచ్చు. నీరు నిలబడని నేలల్లో బాగా వస్తుంది. దీని వేరు, బెరడు కూడా సుగంధ ద్రవ్యాల తయారీకి పనికొస్తాయి. 20-25 ఏళ్లలో చెట్టు 30 అడుగుల ఎత్తున 2.5-3 అడుగుల చుట్టుకొలతతో పెరుగుతుంది. 3-4 ఏళ్లలో పూత, పిందె వస్తాయి. దీనికి దేశీయంగా మంచి గిరాకీ ఉంది. ఎర్రచందనం మాదిరిగా చట్టపరమైన ఆంక్షలేమీ లేవు. అయితే, ఈ రెండు పంటల సాగునూ రాష్ర్ట ఔషధ మొక్కల బోర్డులు ప్రోత్సహిస్తున్నాయి.
      
ఎర్రచందనం అనగానే.. కేసులే గుర్తుకొస్తుంటాయి. కానీ, ఎర్రచందనం సాగు చేయడానికి చట్టపరమైన అభ్యంతరాలేమీ లేవు. చెట్లు నరకడానికి మాత్రం అటవీ శాఖ అనుమతి పొందాలి. అంతరించిపోతున్న అత్యంత విలువైన కలప జాతి కావడం వల్ల ఎర్రచందనం దుంగల ఎగుమతిపై ప్రస్తుతం ఆంక్షలున్నాయి. అయితే, ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం లేదు. అవరోధాలు తొలగకపోతాయా అన్న  ఆశతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు ఎర్రచందనం సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కేవలం సీజనల్ పంటలపైనే ఆశలన్నీ పెట్టుకొని సతమతమయ్యే రైతులు.. భవిష్యత్తులో ఆర్థిక భద్రతనిచ్చే ఈ పంటలను కొద్ది విస్తీర్ణంలోనైనాసాగు చేయడం నిస్సందేహంగా తెలివైన పనే. మారుమూల పొలాల్లోకన్నా నివాసాలకు దగ్గర్లోని పట్టా భూముల్లో సాగు చేయడం మేలు.

 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్
 
ఒకటి కాకపోయినా మరొకటి ఆదుకుంటుంది!
ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు నాటిన మొదట్లో అందరూ నవ్వారు. ఇప్పుడు ఏపుగా పెరుగుతున్న చెట్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక పంటకు కాకపోయినా మరో పంటకైనా మంచి ధర పలుకుతుందనేది నా ఆశ. అందుకే పొలం మొత్తం ఒకటే కాకుండా ఎర్రచందనం, శ్రీగంధం, టేకు మొక్కలు నాటా. మరో 10-12 ఏళ్లకు అదృష్టం బాగుంటే కనీసం రూ.25 కోట్ల ఆదాయం వస్తుంది. పరిస్థితి అనుకూలంగా లేక వంట చెరకుగా అమ్మినా ఖాయంగా రూ. 2 కోట్లొస్తాయి. ఈ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు తెప్పించి, మొక్కలు ఉచితంగా రైతులకివ్వాలి. భూమి తనఖా పెట్టుకొని రుణాలు, సబ్సిడీపై డ్రిప్ ఇవ్వాలి.

- చిలుక విద్యాసాగర్‌రెడ్డి (94908 49474), ఎర్రచందనం, శ్రీగంధం , టేకు సాగుదారుడు, నల్గొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement