vidyabalan
-
నవ్విస్తాం.. ఏడిపిస్తాం...
విద్యాబాలన్–ఇలియానా–ప్రతీక్ గాంధీ–సెంథిల్ రామమూర్తి... ఈ నలుగురూ కలసి నవ్వించడానికి... ఏడిపించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. దర్శకురాలు శీర్షా గుహ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ – ‘‘ఆధునిక మానవ సంబంధాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఇది మీ కథలా అనిపించొచ్చు.. లేకపోతే మీ ప్రెండ్ కథలానూ అనిపించొచ్చు. మొత్తం మీద మనలో ఒకరి కథ. సినిమా ఎంత నవ్విస్తుందో అంతే సమానంగా ఏడిపిస్తుంది కూడా’’ అన్నారు. ‘‘ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే... ఇది అందరి కథ. ప్రపంచం మొత్తానికి చెందిన కథ. ఎలాంటి యాక్టర్లతో సినిమా చేయాలని కల కన్నానో వాళ్లతోనే ఈ సినిమా చేస్తున్నాను’’ అని శీర్షా అన్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
OTTలో విద్యాబాలన్ మూవీ: అప్పటి నుంచే ప్రసారం
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘షేర్నీ’. ‘న్యూటన్’ ఫేమ్ అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విద్యాబాలన్ విడుదల చేసి, ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానున్నట్లు తెలిపారు. జూన్‌లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విద్యాబాలన్ నిజాయతీ గల అటవీ శాఖాధికారి షేర్నీ పాత్ర చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... విద్యాబాలన్ నటించిన గత చిత్రం ‘శకుంతలా దేవి’ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. She is ready to leave a mark! Meet the #SherniOnPrime in June. @vidya_balan #AmitMasurkar @vikramix @ShikhaaSharma03 @AasthaTiku @Abundantia_Ent @TSeries pic.twitter.com/4Wx7jEsvgS — amazon prime video IN (@PrimeVideoIN) May 17, 2021 -
ఆ చేదు సంఘటన ఇంకా మర్చిపోలేదు
వైవిధ్యభరిత పాత్రలకు విద్యాబాలన్ పెట్టింది పేరు. ఆమె బాలీవుడ్, టాలీవుడ్‌లలో పలు ప్రేక్షకాదారణ చిత్రాలలో నటించింది. ఇటీవలే బాలకృష్ణ ‘కథానాయకుడు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అవకాశాల పరంగా తమిళ చిత్ర పరిశ్రమలో రెండు ఇబ్బందికర సంఘటనలు జరిగాయని విద్యాబాలన్ వాపోయింది. దీనికి సంబంధించిన నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ తమిళ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తిరస్కరించడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని విద్యాబాలన్ తెలిపింది. అయితే తన బాధను చూసి తట్టుకోలేక.. తన కుటుంబ సభ్యులు ఆ నిర్మాత ఇంటికి తీసుకుని వెళ్లగా ఆయన ఆశ్చర్యకర రీతిలో తమను అవమానపరిచారని తెలిపింది. తన క్లిప్పింగ్స్ చూపించి ఈమె హీరోయినా? అంటూ నిర్మాత తన అసహనాన్ని వ్యక్తం చేశారని విద్యాబాలన్ తెలిపారు. దర్శకుడు తీసుకున్న నిర్ణయం మేరకే ఒప్పుకున్నానని నిర్మాత తమతో అన్నారని విద్యాబాలన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే కాకుండా మరో తమిళ చిత్రంలో కూడా తనకు చేదు అనుభవం ఎదురయిందని చెప్పుకొచ్చారు. ఆ చిత్రానికి సంబంధించి ఒక రోజు షూటింగ్ కూడా జరిగిందని, అందులోని మితిమీరిన హాస్యం తనకు నచ్చకనే ఆ చిత్రం నుంచి వైదొలగానని ఆమె పేర్కొంది. బాలీవుడ్లో 2005లో వచ్చిన పరిణిత వంటి పలు విజయాలు అందుకున్నా.. కొన్ని పరాజయాలను కూడా చవిచూసింది. ఆమె తాజాగా అక్షయకుమార్ హీరోగా తెరకెక్కిన ‘మిషన్ మంగల్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. -
స్క్రీన్ మీద తలైవిని తలపించేది ఎవరు?
అమ్మను బతికుండగా గుండెల్లో పెట్టుకున్నారు తమిళ జనం.ఇప్పుడు తెర మీద చూసి దండం పెట్టుకోవాలనుకుంటున్నారు.స్క్రీన్ తలైవి ఎవరు?స్క్రీన్ మీద తలైవిని తలపించేది ఎవరు?జయలలిత జీవితంపై తయారవనున్న సినిమాలు కుతూహలం రేపుతున్నాయి.ఇప్పుడు తమిళనాడులో అందరి దృష్టి ఒక డేట్ మీదే ఉంది.ఫిబ్రవరి 24, 2019.నిజానికి ఆ తేదీ చాలా దూరం ఉంది. అయినప్పటికీ హడావుడి మొదలైంది.ఎందుకు?ఏదైనా అద్భుతం జరగబోతోందా?అలాంటిదే.ఆ తేదీన ఒకే వ్యక్తి జీవితంతో నలుగురైదుగురు బయోపిక్‌లు మొదలెట్టాలనుకుంటున్నారు.అర్థమయ్యే ఉంటుంది.అవును.. జయలలిత జీవిత కథను సినిమాగా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఎప్పుడూ లేనట్లు విడివిడిగా నలుగురైదుగురు బయోపిక్‌కి టార్గెట్ పెట్టడం విశేషం.ఇంతకీ ఫిబ్రవరి 24 ప్రత్యేకత ఏంటో చెప్పలేదు కదూ.అది జయలలిత పుట్టినరోజు. మరి.. ఆ రోజు ఆమె జీవిత చరిత్రతో ఎన్ని సినిమాలు మొదలవుతాయో కానీ.. ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్న దర్శక–నిర్మాతల గురించి, ‘జయలలిత బయోపిక్‌లో నటించాలని ఉంది’ అని ఇప్పటికే తమ ఆసక్తి బయటపె ట్టిన కథానాయికల గురించి తెలుసుకుందాం. 2016 డిసెంబర్ 5. తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన రోజు. ‘అమ్మ’ అస్తమించిన రోజు. ‘కోలుకుంటున్నారు. ఇక డిశ్చార్జ్ అవ్వడమే ఆలస్యం’ అని ప్రకటించిన కొద్ది రోజులకే ‘తుది శ్వాస విడిచారు’ అనే షాకింగ్ న్యూస్. ప్రజల కోసం జీవించారు అని ప్రజలు అనుకోవడం వల్లే వారికి ఆ షాక్. అంతేనా? జయలలిత పట్టుదల ఉన్న మనిషి. పట్టుపట్టారంటే సాధిస్తారు. చదువులో మెరిట్ తెచ్చుకున్నా క్లాసికల్ డాన్స్‌లో టాప్ అనిపించుకున్నా ఈ పట్టుదల వల్లే. తల్లి సంధ్య సినిమా నటే అయినా కూతుర్ని నటిగా చూడాలనుకోలేదు. ఒకరోజు ఊరికే మేకప్ వేసుకున్నందుకు కుమార్తెను చెడామడా తిట్టారు. అలాంటిది ఆర్థిక పరిస్థితులకు తలవొంచి కూతుర్ని నటిని చేశారు. అయిష్టంగా వచ్చినా వృత్తికి న్యాయం చేయాలన్నది జయలలిత పట్టుదల. సాధించారు. వెండితెరను ఏలారు. ప్రముఖ నటుడు ఎంజీఆర్‌తో పరిచయం, ఆయన ద్వారా రాజకీయాల్లోకి రావడం, పలు సవాళ్లను ఎదుర్కోవడం.. ఇలా జయలలిత జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ ప్రజలతో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) అనిపించుకున్నారు. ఈ డైనమిక్ లేడీ జీవితంతో ఒక సినిమా అంటే అది సంచలనం. వచ్చే ఏడాది ఆమె జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నాం. ఒక సినిమా కాదు.. మూడు నాలుగు సినిమాల రూపంలో. శశికళ దృష్టి కోణంలో వర్మ సినిమా ‘అమ్మ’ చనిపోయాక ఆమె బయోపిక్‌కి సంబంధించిన ప్రకటన వచ్చింది ముందుగా రామ్‌గోపాల్ వర్మ నుంచే. జీవిత కథలు తీయడం, వాస్తవ సంఘటనలతో సినిమాలు తీయడం వర్మకు చాలా ఈజీ. ‘రక్తచరిత్ర’, ‘26/11 ముంబై ఎటాక్స్’, ‘వంగవీటి’ వంటి బయోపిక్స్‌తో ఆయన రాటుదేలి ఉన్నారు. వర్మ తీస్తున్న సినిమాలు వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోతున్న సమయంలో ఈ సినిమాలు ‘స్పెషల్’గా నిలిచాయి. సో.. బయోపిక్స్ తీయడంలో వర్మని కొట్టేవాళ్లు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. జయలలిత బయోపిక్‌ని ఆమె ఆప్తమిత్రురాలు శశికళ పాయింటాఫ్ వ్యూ నుంచి తీస్తానని వర్మ పేర్కొన్నారు. మరి.. వర్మ మైండ్‌లో ఉన్న బయోపిక్ కెమెరా ముందుకి వచ్చేదెప్పుడో? వారంలో మూడు అనౌన్స్మెంట్లు జస్ట్ వారం అంటే వారమే అయింది విబ్రీ మీడియా సంస్థ అధినేత విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్ ప్రకటించి. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విబ్రీ మీడియా జయలలిత జీవిత చరిత్రను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీయనుందని ఈ ప్రకటన సారాంశం. ‘మదరాస పట్టణం’, ‘దైవ తిరుమగళ్’ (తెలుగులో ‘నాన్న’), ‘అభినేత్రి’ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని ప్రారంభించి అదే రోజున టైటిల్ రోల్ చేసే నటి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారట. విష్ణు ఇందూరి ప్రకటించిన తర్వాత జయలలిత బయోపిక్‌కి సంబంధించి మరో ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు మిస్కిన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన దర్శకురాలు ప్రియదర్శిని తాను కూడా జయలలిత బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. ‘‘నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత ఎదుర్కొన్న సవాళ్లని ఫోకస్ చేస్తూ ఈ సినిమా తీయాలనుకుంటున్నాను’’ అన్నారు ప్రియదర్శిని. వచ్చే నెల 20న నటీనటులను ప్రకటించాలనుకుంటున్నారట. ప్రియదర్శినికి అనుభవం తక్కువ. కనుక ఈ సినిమా ఆమెకు ఓ సవాల్‌గా నిలువనుంది. అయితే ప్రియదర్శిని నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సీనియర్ డైరెక్టర్ భారతీరాజా నుంచి ఓ ప్రకటన వచ్చింది. జయలలిత బయోపిక్ తాను తీయబోతున్నట్టు హల్చల్ సృష్టించారాయన. బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెబుతున్నారు. జయలలిత పాత్రకు ఐశ్వర్యా రాయ్, అనుష్కల్లో ఎవరో ఒకర్ని తీసుకోవాలనుకుంటున్నారని ఫీలర్స్ వదులుతున్నారు. ఎంజీఆర్ పాత్రకు కమల్ హాసన్నుగాని, మోహన్‌లాల్‌ను గాని సంప్రదించాలనుకుంటున్నారట. ‘అమ్మ–పురట్చి తలైవి’ అనేది టైటిల్. అంటే.. ‘అమ్మ–విప్లవ నాయకురాలు’ అని అర్థం. మొదట డిసెంబర్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. కానీ జయలలిత బర్త్‌డే నాడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట. జయ జీవితం... నవరసభరితం ఆమె అందగత్తె. ఎందరికో కలల రారాణి. ఎం.జి.ఆర్ వంటి సూపర్‌స్టార్‌కు కో స్టార్. సన్నిహితురాలు. రాజకీయాలలో పురుష సమాజాన్ని ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. అసెంబ్లీలో చీర లాగబడి పరాభవంతో ప్రతిజ్ఞ బూనిన అభినవ ద్రౌపది. అదే సమయంలో పేదల పట్ల దయాళువు. సెంటిమెంట్ల పుట్ట. మరో స్త్రీకి నెచ్చెలి. ఇన్ని పార్శా్వలు బహుశా ఏ ఇతర వ్యక్తిలోనూ లేవు. అందుకే జయ జీవితాన్ని ఎన్ని బయోపిక్స్‌గా తీసినా జనం వాటిని తప్పక చూస్తారు. ఎందుకంటే ఎంత తీసినా ఆమె కథ ఇంకా మిగిలి ఉంటుంది కనుక. జయలలితగా ఎవరెవరు నటించాలని అనుకుంటున్నారు? మన సౌత్‌లో గడచిన 15 ఏళ్లల్లో తిరుగు లేని తార త్రిష. ఆమె తర్వాత ఎంతోమంది వచ్చినా త్రిష స్టిల్ బిజీ. కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు చేసిన త్రిషకు జయలలితగా నటించాలని ఉందట. ‘‘ఆమె సినిమా కెరీర్ గ్రాఫ్ అద్భుతం. పొలిటికల్ గ్రాఫ్ సూపర్. పవర్ఫుల్ లేడీ. ఆమె బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే హ్యాపీ’’ అని ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అందాల తార నయనతార వచ్చి పదేళ్లు పైనే అయింది. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అవకాశం వస్తే ఆమెకు కూడా జయలలిత బయోపిక్‌లో నటించాలని ఉందట. ‘‘జయలలితగారి జీవిత చరిత్రలో ఏ కథానాయికకు మాత్రం నటించాలని ఉండదు. ఆ చాన్స్ నాకు వస్తే చేస్తా’’ అని ఓ సందర్భంలో నయన అన్నారు. ఇక ‘పురట్చి తలైవి’ పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్న మలయాళ నటి ఎవరో తెలుసా? ‘సాహసం శ్వాసగా సాగిపో’లో నటించిన మలయాళ కుట్టి మంజిమా మోహన్ గుర్తున్నారు కదా. ఆమెకు జయలలిత పాత్ర చేయాలని ఉందట. మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్ ఇస్తే.. ‘‘నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది’’ అన్నారు. ‘మహానటి’ సావిత్రి పాత్రకు కీర్తీ సురేష్ తప్ప ఎవరూ నప్పేవారు కాదనే విధంగా ఆమె నటించారు. ఆ బయోపిక్‌కి పూర్తిగా న్యాయం చేసిన కీర్తి ఆ సినిమా ప్రమోషన్స్‌లో మరో బయోపిక్‌కి చాన్స్ ఉందని హింట్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పట్లో మరో బయోపిక్ అంటే ఆలోచించాలి? వెంటనే మరో జీవిత చరిత్ర అంటే సామాన్యమైన విషయం కాదని కూడా ఆమె అన్నారు. ఇంతకీ కీర్తీ హింట్ ఇచ్చినది జయలలిత బయోపిక్కేనా? వేచి చూద్దాం. విద్యాబాలన్‌పై అందరి దృష్టి ఒక బయోపిక్ అనౌన్స్ చేయగానే ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే చర్చ జరగడం కామన్. ప్రస్తుతం ఇదే చర్చ ఇటు సౌత్ అటు నార్త్‌లో జరుగుతోంది. మొదటగా సౌత్ నుంచి నార్త్‌కి వెళ్లి కథానాయికగా సెటిలైన ‘విద్యాబాలన్’ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్’కి విద్యా ఎంత న్యాయం చేశారో తెలిసిందే. ఆన్సెట్స్లో ఉన్న ‘యన్.టి.ఆర్.’ బయోపిక్‌లో బసవ తారకం పాత్ర చేస్తున్నారామె. ‘డర్టీ పిక్చర్’ తర్వాత ఏ బయోపిక్ ప్రస్తావన వచ్చినా విద్యాబాలన్ పేరు వినిపిస్తుంటుంది. ప్రముఖ బాలీవుడ్ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీ దర్శకుడు తిగ్మాన్షు ధూలియా తీయాలనుకున్న సినిమాలో విద్యాబాలన్‌నే తీసుకున్నారు. ముందు ఒప్పుకున్న విద్యా ఆ తర్వాత తప్పుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంతో సినిమా చేయడానికి బాలీవుడ్లో సన్నాహాలు మొదలైనప్పుడు కూడా విద్యాబాలన్ పేరే వినిపించింది. ఇప్పుడు కూడా జయలలిత బయోపిక్‌కి ఆమె పేరు వినిపిస్తోంది. – సినిమా డెస్క్ -
ఇస్తినమ్మ వాయనం...
‘తుమ్హారీ సులూ’ సినిమా తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బసవతారకం రోల్ చేస్తున్నారు విద్యా బాలన్. ఆ మధ్య ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ యాక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అప్డేట్ ఇంకా లేదు. ఆయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారమేంటంటే తమిళంలో జ్యోతిక కమ్‌బ్యాక్ చిత్రంగా చేసిన ‘36 వయదినిలే’ హిందీ రీమేక్‌లో నటించడానికి విద్యా ఆసక్తికరంగా ఉన్నారని టాక్. ‘36 వయదినిలే’ మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు రీమేక్. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం, సబ్జెక్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశారట విద్యా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనంలా ఉంది విద్యా బాలన్, జ్యోతికల పరిస్థితి. ఒక పక్క విద్యా బాలన్ ‘తుమ్హారీ సులూ’ రీమేక్ లో జ్యోతిక యాక్ట్ చేస్తుంటే, విద్యా బాలన్ ఏమో జ్యోతిక సినిమా రీమేక్ చేయాలనుకోవడం విశేషం. -
విద్యాబాలన్ పాత్రలో జ్యోతిక
తమిళసినిమా: నటి విద్యాబాలన్ పాత్రను పోషించడానికి జ్యోతిక రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. జ్యోతిక వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా నటిగా తన ఇమేజ్ను కాపాడుకుంటూ వస్తుంది. కథానాయకిలా యువళగీతాలు పాడకపోయినా, అంత కంటే బలమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ పయనాన్ని కొనసాగిస్తున్నారు. జ్యోతిక రీఎంట్రీ తరువాత 36 వయదినిలే, మగళీర్ మట్టుం చిత్రాలలో నటించారు. కాగా తాజాగా బాలా దర్శకత్వంలో నాచియార్ చిత్రంలో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆధికారిగా టైటిల్ రోల్‌ను పోషించి మరో సారి తన సత్తా చాటుకున్నారు. కాగా జ్యోతిక తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో విద్యాబాలన్ నాయకిగా నటించిన మంచి విజయాన్ని సాధించిన చిత్రం తుమ్హారి సుళు. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విద్యా పోషించిన పాత్రలో నటించడానికి రంగం సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. ఓ మధ్యతరగతి కుటుంబ స్త్రీ ఆ తరువాత రేడీయో జాకీ స్థాయికి ఎలా ఎదిగిందనే పాత్రను విద్యాబాలన్ చాలా సమర్దవంతంగా నటించి పలు అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రం విడుదలైన సమయంలోనే నటి జ్యోతిక చాలా మంచి చిత్రం. దీన్ని ఎవరు తమిళంలో రీమేక్ చేస్తారోగానీ అంటూ మెచ్చుకున్నారు. కాగా ఇప్పుడా పాత్రలో నటించే అవకాశం తననే వరించింది. చాలా కాలం క్రితం రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక చెవిటి అమ్మాయి పాత్రలో నటించి అద్భుతమైన అభినయంతో ఆ చిత్ర విజయానికి కారణం అయ్యారు. తాజాగా హింది చిత్రం తుమ్హారి సుళు తమిళ రీమేక్ వీరిద్దరి కాంభినేషన్లో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం జ్యోతిక మణిరత్నం దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత తుమ్హారి సుళు రీమేక్‌లో నటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
విద్యాబాలన్ మళ్లీ ఎగరేసుకుపోయిందిగా..
సాక్షి, ముంబయి : జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. 2017 సంవత్సరానికి గాను 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని శనివారం రాత్రి (జనవరి 20) నిర్వహించారు. బాలీవుడ్ సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు ఇతర విభాగాలకు ఈ అవార్డులు అందజేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుడు నిర్మాత కరణ్ జోహార్ ఆతిథ్యం నిర్వహించారు. 2017 సంవత్సరానికిగాను అందించిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును ఇర్ఫాన్ ఖాన్ అందుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచారు. ఆమెకు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు. ‘తుమ్హారి సులు’ చిత్రంలో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డును అందించారు. కాగా, ఉత్తమ దర్శకత్వం అవార్డును అశ్వినీ అయ్యర్ తివారీ అందుకున్నారు. ఇక క్రిటిక్స్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా న్యూటన్ నిలవగా ఉత్తమ నటుడిగా రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్), ఉత్తమ నటిగా జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్) నిలిచారు. దీంతోపాటు పలు విభాగాల్లో కూడా అవార్డులు అందజేశారు. -
తగ్గాల్సింది నేను కాదు... మారాల్సింది మీరే!
కొంచెం బొద్దుగా ఉండే కథానాయికలను ‘ఎప్పుడు సన్నబడతారు?’ అనడుగుతారు. ‘జీరో సైజ్’ హీరోయిన్లను ‘కొంచెం బరువు పెరిగితే బాగుంటుంది’ అంటారు. ఎలా ఉన్నా ఏదొకటి అంటారు. కొందరు హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్‌ని లైట్ తీసుకుంటారు. నిన్న మొన్నటివరకూ విద్యాబాలన్ అలానే తీసుకున్నారు. కానీ, ఇక ఇలాంటి ప్రశ్నలడిగితే క్షమించేది లేదన్నట్లు ఘాటుగా స్పందించారు. సురేశ్ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన ‘తుమ్హారీ సులు’ నేడు విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న విద్యాబాలన్‌ని.. ‘ప్రస్తుతం మీరు లావుగా ఉన్నారు. ఎప్పుడు సన్నబడి గ్లామర్ రోల్స్ చేస్తారు?’ అని ఓ విలేకరి అడిగారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? గ్లామర్‌గా కనిపించాలంటే సన్నబడాలా? సన్నగా ఉంటేనే అవకాశాలొస్తాయా? అయినా, నేను ప్రస్తుతం బరువు తగ్గాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్న పాత్రలకు నాజూకుగా ఉండాలని రూలేం లేదు. ఈ విషయంలో ముందు మీ మైండ్ సెట్ మారాలి. తగ్గాల్సింది నేను కాదు’’ అని ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడేం అడిగామని.. సన్నబడతారా? అన్నాం.. అంతేగా? అని సదరు విలేకరి సన్నిహితులతో వాపోయారట. -
దీపికాతో గొడవ ఎందుకని!?
సులోచన మరో వారం ముందుకొచ్చేసింది. సులోచన అంటే విద్యాబాలనే! ఆమెకు దీపికాతో గొడవ ఏంటి? అంటే... దీపికాతో కాదు, దీపికా పదుకునే నటించిన సినిమాతో గొడవ ఎందుకని!? అసలే, దీపిక నగలు, ఆమె రాజసం చూస్తే భారీగా ఉన్నాయి. విద్యా ఏమో సింపుల్‌గా శారీ కట్టుకొస్తున్నారు. దీపిక భారీ హడావిడి ముందు సింపుల్ శారీ ఎక్కడ చిన్నబోతుందోనని విద్యాబాలన్ మరింత ముందుకొచ్చేశారని బీటౌన్ టాక్!! మేటర్ ఏంటంటే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్ రాణి పద్మావతిగా దీపిక నటించిన సినిమా ‘పద్మావతి’. షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కూడా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్.జె. (రేడియో జాకీ) సులోచనగా విద్యాబాలన్ నటించిన ‘తుమ్హారీ సులు’ను కూడా ముందు డిసెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. ‘పద్మావతి’తో పాటు అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ల ‘101 నాట్ అవుట్’ కూడా అదే తేదీన విడుదల చేయాలనుకుంటున్నారని ‘తుమ్హారీ సులు’ టీమ్ కొంచెం జాగ్రత్త పడింది. డిసెంబర్ 1న కాకుండా నవంబర్ 24న వస్తామని చెప్పారు. ఇప్పుడు ‘పద్మావతి’ ట్రైలర్ విడుదలైన తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నారు. మరో వారం ముందుకొచ్చారు. నవంబర్ 17న ‘తుమ్హారీ సులు’ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దీపిక సినిమా వచ్చిన తర్వాత సులోచన ఎక్కడ కనిపించకుండా పోతుందోనని ఆ సినిమాకీ ఈ సినిమాకీ పది రోజులకు పైగా గ్యాప్ ఉండేలా చూసుకున్నారట. -
రజనీ సినిమాలో విద్యాబాలన్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్ పా దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ రూపొందిస్తోంది. మే లో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనున్నట్టు సమాచారం. దీని గురించి విద్యాబాలన్‌తో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే విద్యబాలన్ మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో చిత్ర అవవకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలోనూ రజనీ వృద్ధ గెటప్‌లో నటించనున్నారని సమాచారం. -
విద్యాబాలన్ మిస్సింగ్..!
విద్యాబాలన్ తప్పిపోయారు....? మీరనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాదు....ఈ సినిమాలో ఓ పాత్ర పేరు. అసలు ఈ విద్యాబాలన్ ఎవరు...? ఎందుకు కనిపించట్లేదు...? వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలంటే ‘వేరీజ్ విద్యాబాలన్’ చూడాల్సిందే. ప్రిన్స్, జ్యోతీ సేథ్ జంటగా శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘కథ’, ‘ఒక్కడినే’ ఫేం శ్రీనివాస్ దర్శకుడు. వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. టైటిల్ తరహాలోనే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇదని, సంపూర్ణేష్ బాబు కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శ్రీను, బాలాజీ శ్రీను ,సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి.