హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్‌లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్‌రాజ్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.
50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్‌లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్‌గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు.
విజయ్ అమృత్‌రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్‌గా 15 టైటిళ్లు సాధించిన అమృత్‌రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్‌గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు.