vijay bhaskar reddy
-
విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసు: టీడీపీ నేతలకు జీవిత ఖైదు
సాక్షి, అనంతపురం: అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత అప్పిచర్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురుప్రసాద్ నాయుడికి జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు గుత్తి కోర్టు.. ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. పెద్దవడుగూరు సొసైటీ కార్యాలయంలో విజయ్‌భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురు ప్రసాద్ నాయుడు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన గుత్తి కోర్టు.. వీరిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. అలాగే, మరో ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. కాగా, నిందితులంతా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనచరులు కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు -
రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
‘బోండా ఉమా ఆరోపణలు నిజం కాదు’
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు తీరుపై సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసు వ్యవస్థపై బోండా ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. మాచర్ల ఘటనపై విచారించేందుకు బోండా ఉమాకు గురజాల డీఎస్పీ నోటీసులు పంపించారని తెలిపారు. విచారణకు రాకుండా తనను చంపడానికి నోటీసు ఇచ్చారనడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఒక భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహించారు. (‘మీపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం’) గురజాలలో నమ్మకం లేనప్పుడు పైఅధికారి దగ్గరికి వెళ్లి వాంగ్మూలం ఇవ్వచ్చు కదా అని అన్నారు. అలా కాకుండా గుంటూరు పోలీసులు నిద్రావస్థలో ఉన్నారనటం సరికాదనన్నారు. ఇక మీదట ఎవరైనాసరే పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయభాస్కరరెడ్డి అన్నారు. -
వైవిధ్యంగా...
విజయ్‌భాస్కర్‌రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కార్తిక’. కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై మచెందర్ నట్టల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. కొత్త పరశురామ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ్భాస్కర్రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా పూర్తి న్యాయం చేసాడు’’ అన్నారు. ‘‘పరశురామ్ నాకు చెప్పిన కథను అలానే తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. మా టీమ్‌కి మంచి పేరొస్తుంది. త్వరలో పాటలు రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మచెందర్ నట్టల. అజయ్‌ఘోష్, రూలర్ రఘు, ప్రీతి, ప్రియ కోల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, కెమెరా: వల్లి ఎస్కె, సంగీతం: సుభాష్ ఆనంద్. -
సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో చదివాడు. 2001లో పదవ తరగతి పరీక్షలో 468 మార్కులు సాధించాడు. తర్వాత విజయవాడలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో (ఎంపీసీ) ఇంటర్ చదివి 921 మార్కులు పొందాడు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 77 శాతం మార్కులతో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం చెన్నైలోని సీటీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివాడు. దిల్లీలోని వాజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. మూడేళ్లుగా వరుసగా సివిల్స్పరీక్షలు రాస్తున్నాడు. సోషియాలజి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువడిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలలో ఆలిండియాలో 85వ ర్యాంక్ సాధించాడు. శనివారం వెలువడిన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 462వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా ఈయనకు ఐపీఎస్, ఐఆర్ఎస్, కస్టమ్స్ ఆఫీసర్లలో ఏదో ఒక పోస్టు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయభాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు పెద్ద సుబ్బారెడ్డి, వెంకటమ్మలు మైలవరం మండలంలోని బాక్రాపేట గ్రామానికి చెందిన వారు. వీరిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అయితే మైలవరం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామం ముంపునకు గురికావడంతో ప్రొద్దుటూరుకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత కాలంలో పెద్ద సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. సివిల్ ర్యాంకర్ విజయభాస్కర్‌రెడ్డికి విజయలక్ష్మిదేవి, ప్రమీల దేవి, శశిరేఖ అనే అక్కచెల్లెల్లు ఉన్నారు, వారికి వివాహం అయింది. వైద్య వృత్తి నుంచి సివిల్స్‌లోకి.. వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రూకావాండ్లపల్లెకు చెందిన డాక్టర్ ఏ.సురేష్‌రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో 525వ ర్యాంకు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, ధర్మాదేవిల కుమారుడు. ప్రస్తుతం వీరు రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు శ్రీనికేతన్(రాయచోటి), ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు (ఆంగ్లో ఇండియన్, రాయచోటి), తొమ్మిదవ తరగతి(రాజు స్కూల్), పది నుంచి ఇంటర్ వరకు(రత్నం కళాశాల, నెల్లూరు), ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. రెండు సంవత్సరాలుగా రోయచోటిలో బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇతను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం పట్ల తన సొంత గ్రామమైన నూకావాండ్లపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఆ లక్ష్యం సాధనకు సమయం కేటాయించుకుని పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా చదివితే లక్ష్యం చేరడం కష్టం కాదని చెప్పారు. ఐఏఎస్ కోసం మరోసారి ప్రయత్నిస్తా : డా.ధీరజ్ నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బి.ధీరజ్‌కుమార్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1177వ ర్యాంకు సాధించారు. ధీరజ్‌కుమార్ తండ్రి బి.జయభాస్కర్రావ్ వృత్తి రీత్యా రైల్వేలో వైద్యుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రస్తుతం ఈయన గుంటకల్ రైల్వే డివిజన్లో అసిస్టెంట్ చీప్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ధీరజ్ తల్లి ఎం.విజయభారతి రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ డి.ఎమ్.డబ్లు.ఒ.గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్‌లో విజయం సాధించారు. ఇతని సోదరుడు దీపక్‌కుమార్, సోదరి దీప్తిలు సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నందలూరులోని శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్లో పదవ తరగతి, నెల్లూరులోని రత్నం కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. సివిల్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ ఫలితం పట్ల తాను పెద్దగా సంతృప్తి పడటం లేదన్నారు. ఈ ర్యాంక్‌తో ఐఆర్ఎస్ రావచ్చని, తన లక్ష్యం ఐఏఎస్ అని చెప్పారు. ఆ లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహకం అధికంగా ఉందని అన్నారు. -
భాస్కర్ రెడ్డి హత్యకేసు; ఎస్సై , కానిస్టేబుళ్లపై బదిలీ వేటు
అనంతపురం:వైఎస్సార్ సీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సీరియస్ గా స్పందించారు. పెద్దవడుగూరు ఎస్సై నీరంజన్ రెడ్డితో సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించి చార్జ్ మెమోను ఎస్పీ గురువారం జారీ చేశారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.సొసైటీ కార్యాలయంలో విజయ్ భాస్కర్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. -
వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ భాస్కర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న అతనిపై మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. సొసైటీ కార్యాలయంలో విజయ్ భాస్కర్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.